భారత క్రికెట్ క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ మహిళా సారథి మిథాలీ రాజ్, మాజీ పేసర్ జులన్ గోస్వామి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ సారథి మొహమ్మద్ అజారుద్దీన్‌ల బయోపిక్స్ తెరకెక్కాయి.
కాగా, త్వరలోనే సిక్సర్ల కింగ్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. నేడు సినిమాను అనౌన్స్ చేశారు. యువరాజ్ సింగ్ జీవితం మీద సినిమా తీస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్ చందక వెల్లడించారు.
యువీ బయోపిక్‌కు ఇంకా పేరుపెట్టలేదు. ఇందులో హీరో ఎవరు?, ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది కూడా ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియరానున్నాయి. డీటెయిల్స్ ఇవి చెప్పకుండా.. యువరాజ్ బయోపిక్ త్వరలో తీస్తామని నిర్మాతలు భూషణ్ కుమార్, రవి భాగ్ చందక ప్రకటించారు.
ఈ ఇద్దరితో పాటు యువీ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు ఆడిన యువరాజ్ సింగ్.. 2000 సంవత్సరంలో అండర్ 19 ప్రపంచకప్ ఆడారు. అదే ఏడాది కెన్యాపై అరంగేట్రం చేసాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
2007, 2011 ప్రపంచకప్ టోర్నీలను భారత్ గెలవడంతో యువీ పాత్ర కీలకం. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన యువీ.. 40 టెస్ట్, 304 వన్డే, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. 2011 వరల్డ్‌కప్ అనంతరం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన యువీ.. అమెరికాలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు.