Tuesday, November 26, 2024

చావు పుట్టుకలు సహజం… చావు కబురు చల్లగా రివ్యూ

ఆర్‌ఎక్స్‌100 సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కార్తికేయ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో పాటు కార్తికేయకు మంచి పేరును కూడా తీసుకొచ్చింది . అయితే ప్రస్తుతం కార్తికేయ చావు కబురు చల్లగా.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగానే పెంచాయి . కౌశిక్ పెగ‌ళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఇక కథ విషయానికి వస్తే బస్తీ బాలరాజు గా శవాలను మోసుకెళ్లే స్వర్గపురి వాహన డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఎవరు చనిపోయినా తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో తాగుతూ తిరుగుతుంటాడు. ఇక బాలరాజు తల్లి గంగమ్మ(ఆమని) మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. తండ్రికి కాళ్ళు చేతులు రావు. ప్రాణం ఉన్నా లేనట్టే ఉంటాడు.

అయితే ఒక రోజు ఒక శవాన్ని శ్మనానవాటికకు తరలించాలని బాలరాజుకు ఫోన్‌‌ వస్తుంది. అక్కడికి వెళ్లిన బాలరాజు మల్లిక(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే చనిపోయిన వ్యక్తే మల్లికా భర్త. అంత్యక్రియల సమయంలోనే మల్లికను పెళ్లి చేసుకుంటానని వారి బంధువుల ముందే చెప్పేస్తాడు. కానీ దానికి మల్లికతో పాటు ఆమె అత్తమామలు కూడా నిరాకరిస్తారు. కానీ బాలరాజు మల్లిక వెంటపడుతూనే ఉంటాడు.

ఇదిలా ఉండగా మరోవైపు టీవీలు రిపేరు చేసే మోహన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)తో గంగమ్మ(ఆమని) కాస్త చనువుగా ఉండటం చూసి బాలరాజు తట్టుకోలేడు . ఈ వయసులో తన తల్లి మరో వ్యక్తితో వివాహయేతర సంబంధం కొనసాగించడం నచ్చక తల్లిపై ద్వేషం పెంచుకుంటాడు. తన తల్లి కంటే భర్తను కోల్పోయిన మల్లిక చాలా గొప్పదనే భ్రమలో ఉంటాడు. అసలు గంగమ్మ మరో వ్యక్తితో చనువుగా ఉండాల్సిన అవసరం ఏం వహ్చింది… భర్తను కోల్పోయిన మల్లిక ప్రేమను బస్తీ బాలరాజు ఎలా దక్కించుకున్నాడనేది సినిమా కథ. చావు పుట్టుకలు సహజం. పుట్టిన వాడు ఏదో ఒక రోజు చావక తప్పదు. అలా అని చనిపోయిన వారినే తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడితో వారి జీవితం అయిపోలేదు అనేదే చావు కబురు చల్లగా సినిమా ఉద్దేశం. నటీనటుల విషయానికి వస్తే బస్తి బాలరాజు గా కార్తికేయ నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమని పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే డిఫ్రెంట్ కథతో వచ్చినప్పటికీ దర్శకుడు చూపించటంలో కొంచెం అసంతృప్తి పరిచాడనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement