Monday, November 11, 2024

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వ అనుమతి.. ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ

అమరావతి, ఆంధ్రప్రభ: సంక్రాంతికి బడా హీరోల సినిమాలు ప్రేక్షకులకు సందడి చేయనున్నాయి. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా గురువారం విడుదల కానుండగా..మరో అగ్రహీరో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య శుక్రవారం విడుదల కానుండి. రెండు సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. భారీ బడ్జెట్‌ సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటును గతంలో ప్రభుత్వం కలిపించింది. ఇందుకు ప్రత్యేక కమిటీ సూచనల మేరకు నిర్ణయించనున్నట్లు గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్వహకులు దరఖాస్తు చేసుకున్నారు.

రెండు సినిమాలకు రూ.45 వరకు అదనంగా పెంచుకునేలా అనుమతివ్వాలని మైత్రీ మూవీస్‌ నిర్వహకుల కోరిక మేరకు పరిశీలించిన ప్రభుత్వం..వీర సింహారెడ్డి సినిమాకు రూ.20, వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. పెంచిన టిక్కెట్టు రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన రేట్లు పది రోజుల పాటు అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలుత మూవీ మేకర్స్‌ కోరిక మేరకు రూ.45 పెంచుకునేందుకు అనుమతించడంపై అధికారులు చర్చించారు. ఓ వైపు సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించిన నేపధ్యంలో పెద్ద మొత్తంలో పెంచేందుకు అనుమతి ఇవ్వడం మంచిది కాదని భావిస్తూ తదుపరి నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement