బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్..ఆలియాభట్ నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ.. ఈ చిత్రానికి వచ్చిన కొన్ని విమర్శల నేపథ్యంలో రెండు, మూడో భాగాలను మరింత భారీగా, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. దీని కోసం చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్’, పార్ట్ 3 సినిమాలను ఎప్పుడు విడుదల చేయబోతున్నామో చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 మీద ప్రేక్షకులు కురిపించిన ప్రేమను, వారి అభిప్రాయాలను స్వీకరించిన తరవాత పార్ట్ 2, పార్ట్ 3 చిత్రీకరణ విషయంలో మరింత దృష్టి పెట్టానని అయాన్ ముఖర్జీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
పార్ట్ 1తో పోలిస్తే రాబోయే రెండు భాగాలు భారీగా, మరింత ప్రతిష్టాత్మకంగా ఉండాలని తాను ఇప్పుడు తెలుసుకున్నానని అన్నారు. బ్రహ్మాస్త్ర రెండు, మూడు భాగాలకు కట్టుదిట్టమైన కథను సిద్ధం చేయడానికి తమకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని తనకు అర్థమైందని చెప్పారు.ఏకంగా మూడేళ్లకు పైగా సమయం తీసుకోబోతున్నారాయన. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్’ను 2026 డిసెంబర్‌లో విడుదల చేయనుండగా.. పార్ట్ 3ని 2027 డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు. మేం ఈ రెండు సినిమాలనూ ఒకేసారి చిత్రీకరించాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే, తక్కువ వ్యవధిలో ఈ రెండు సినిమాలను విడుదల చేస్తాం. దీని కోసం నేను కొంత సమయాన్ని కేటాయించుకున్నాను. దాని గురించే ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నాను అని అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు.