సిద్దిపేటకు చెందిన ఫోక్ సింగర్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. ఫోక్ సింగర్ గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న శృతి… ఆత్మహత్య చేసుకుంది. అయితే, భర్త, అత్తమామలు వేధింపుల కారణంగానే శృతి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన దయాకర్ తో శృతి ప్రేమలో పడింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే పెళ్లయిన 20 రోజులకే ఆమె శవమై కనిపించింది. పెళ్లి తర్వాత శృతిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు దయాకర్… అప్పటి నుంచి అత్తింట్లో ఆమెపై వేధింపులు మొదలయ్యాయి.
కట్నం తేవాలని అత్తమామల పోరు ఎక్కువైంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక శృతి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తెను భర్త, అత్తమామలు హత్య చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.