తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీర్మానాలను విడుదల చేసింది. ఇక నుంచి థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాతే భారీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సినీ నిర్మాతల మండలి మంగళవారం సమావేశమైంది.
ఓటీటీ, వీఎఫ్ఎక్స్ చార్జీలు, సినిమా టికెట్ ధరల వంటి పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారీ సినిమాలను థియేటర్‌లో విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలను 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వొచ్చని పేర్కొంది. సినిమా ప్రదర్శనకు వీఎఫ్ఎక్స్ చార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని తీర్మానించింది.
టికెట్ ధరల విషయానికొస్తే, సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని సినీ నిర్మాతల మండలి భావించింది. నగరాలు, పట్టణాల్లోని సాధారణ థియేటర్లు, సీ-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలను రూ.100, రూ.70 ( జీఎస్టీతో కలిపి ) ఉంచాలని ప్రతిపాదనలు చేసింది. మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125గా ఉండేలా ప్రతిపాదించింది.. మీడియం బడ్జెట్/ హీరో సినిమాలకు అత్యధికంగా రూ.150 ప్లస్ జీఎస్టీ మాత్రమే ఉండాలని ప్రతిపాదనలు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.