సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక ఇటీవల ఉత్తరాఖండ్‌లో కుంభమేళ ను నిర్వహించడంపై వరుస ట్వీట్ లు చేస్తున్నాడు వర్మ. బ్రేకింగ్ న్యూస్ః పరీక్షలు వాయిదాపడ్డాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. థియేటర్స్ బంద్ అయ్యాయి. రెస్టారెంట్లు లేవు. అన్ని పనులు ఆగిపోయాయి. ఇవన్నీ ఆగిపోవడానికి కారణం కరోనా వైరస్ భయం కాదు. కుంభమేళ, రాజకీయ సభల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అందరికీ ఇచ్చిన సెలవులు ఇవి. థ్యాంక్యూ గవర్నమెంట్ అంటూ ట్విట్టర్ వేదికగా వర్మ పేర్కొన్నారు.
ఒక సాధారణ పౌరుడికి మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. మరి మాస్కులు లేకుండా కుంభమేళ నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం, ఇతర అధికారులకు ఎంత ఫైన్ వేయాలి.. 10 కోట్లా.. వెయ్యి కోట్లా…థ్యాంక్యూ గవర్నమెంట్.. కుంభమేళ నిర్వహణతో ఈ జన్మను విడిచి పునర్జన్మ ఎత్తే అద్భుత అవకాశం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మరో జన్మకు మీరు అవకాశం ఇస్తోంటే.. మేము బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు అంటూ మిమ్మల్ని విమర్శించినందుకు క్షమించండి అంటూ వర్మ ట్వీట్ లు మీద ట్వీట్ లు పెడుతున్నాడు.