అభిమానులు చాలా కాలంగా జూ.ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ కొత్త కబురు కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చే సినిమా పైగా వైవిధ్యం ఉన్న కథా చిత్రం కావడంతో ‘దేవర’పై అంచనాలు అధికంగా ఉన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటిభాగం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకులను అలరించనుంది.
షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకు నేపథ్యం హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇలాంటి నేపథ్యం ఇప్పటి వరకు రాలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ‘దేవర’ ఫస్ట్ సింగిల్ తేదీ ఖరారైందని సామిజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టిన రోజు (20 మే)న ముహూర్తంగా నిర్ణయించారని, దీన్ని విడుదల చేస్తారని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటనరావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. దేవర ఓటీటీ హక్కులు భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అధినేతలు కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.