టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిన్న పరిశ్రమకు చెందిన అనువాద రచయిత రామకృష్ణ., ప్రముఖ చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్.. కన్నుమూశారు. వీరి మరణ వార్త జీర్ణించుకోకముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన (మంగళవారం) ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశ్వేశ్వరరావు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపంలోని సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. విశ్వేశ్వరరావు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించారు. 300కు పైగా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా వంశీ దర్శకత్వం వహించిన సినిమాల ద్వారా విశ్వేశ్వరరావు చాలా గుర్తింపు పొందారు.
ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన నటించాడు. సినిమాలే కాకుండా సీరియల్స్‌లో కూడా విశ్వేశ్వరరావు నటించారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పనిచేశాడు. పెద్దయ్యాక సినిమాలు, సీరియల్స్ ఆపేసి విస్సు టాకీస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపాడు. అందులో తన అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకునేవారు. ఆయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.