మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాపై కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. ఈమధ్యకాలంలో తమన్నా సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తున్న విషయం తెల్సిందే. ఎప్పటినుంచో ఆమె మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ కోసం పనిచేస్తుంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ ను ఫెయిర్ ప్లే యాప్ లో అక్రమంగా ఆమె ప్రసారం చేసింది. దీంతో వయాకామ్ సంస్థ తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో వారు తమన్నాకు నోటీసులు జారీ చేశారు.
తమన్నా చేసిన పనివలన తాము రూ. 100 కోట్లు నష్టపోయామని తెలిపింది. ఈ నెల 29 న ఆమె కోర్టుకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. గతేడాది ఐపీఎల్ మ్యాచెస్ స్ట్రీమింగ్ మొత్తాన్ని వయాకామ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ కు ఇదేమి కొత్త కాదు. ఈ కేసులో కేవలం తమన్నా మాత్రమే కాదు చాలామంది స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే నటుడు సంజయ్ దత్, గాయకుడు బాద్ షా, జాక్వలిన్ ఫెర్నాండజ్ మేనేజర్ ల దగ్గరనుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది.
ఇక తమన్నా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయడంలేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తుంది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసునుంచి తమన్నా ఎలా బయటపడుతుందో చూడాలి.