పోలీసు, జవాను ఈ పాత్రలు ప్రేక్షకులకు త్వరగా చేరువవుతాయి. కాకీ పవర్ చూపించాలంటే పోలీస్ పాత్రలు. దేశభక్తి చాటాలంటే సైనికుడి పాత్రలను రచయితలు సృష్టిస్తుంటారు. ఈ క్యారెక్టర్లు ధరించడానికి హీరోలు సైతం ఆసక్తి చూపిస్తారు. టాలీవుడ్ చరిత్రలో ఎన్టీఆర్, అక్కినేని మొదలు దాదాపు అందరు హీరోలు వీర జవాను పాత్రలు చేసినవారే. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా వచ్చింది. ఈ తరానికి కూడా తెలిసిన మేజర్ కథకావడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. సైనికుడిగా అడవి శేష్ నటించారు. ఈ సందర్భంగా గతంలో తెలుగులో సైనికుడు పాత్రల్లో మన హీరోలు ఎవరు నటించారనేది ఒకసారి మననం చేసుకుందాం.
జై జవాన్ జై కిసాన్ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ నినాదంఇ చ్చారు. ఆ స్ఫూర్తితో తెలుగు హీరోలు సైనికుడి పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించారు. మహానటుడు ఎన్టీఆర్ బొబ్బిలిపులి సినిమాలో మేజర్ పాత్రని ధరించారు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిం దో తెలిసిందే. ఇక అక్కినేని నాగేశ్వర రావు సిపాయి చిన్నయ్యలో టైటిల్ పాత్ర చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ భారత సింహంలో, శోభన్‌బాబు మహాసంగ్రామం, కల్యాణ తాంబూలం, జగన్ వంటి సినిమాల్లో సైనికుడి పాత్రలు చేశారు. స్టార్ హీరోయిన్ విజయశాంతి సైతం భారతరత్న సినిమాలో ఆర్మీ మేజర్‌గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి కూడా సైనికుడిగా నటించారు. యుద్దభూమి, స్టాలిన్ ఇంకా కన్నడ సినిమా మేజర్‌లో ఆయన నటించారు.
నవతరం హీరోల విషయానికి వస్తే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్‌బాబు మేజర్ పాత్రని పోషించారు. వెంకిమామ సినిమాలో నాగచైతన్య సైనికుడిగా కనిపిస్తారు. నిర్మాణంలో ఉన్న బాలీవుడ్ సినిమా లాల్‌సింగ్ చద్దాలో సైతం చైతు ఇదే తరహా పాత్ర చేస్తున్నారని తెలిసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం సైనికుడి కథతో తీసిందే. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులిలో ఎన్‌ఎస్‌జి కమాండోగా కనిపిస్తారు. జూ.ఎన్టీఆర్ కూడా శక్తి సినిమాలో కమెండో పాత్రని చేశారు. నందమూరి బాలకృష్ణ సైనికుడిగా కనిపించేది కొద్దిసేపే అయినా మంగమ్మగారి మనవడులో మెరిశారు. ఇంకా విజయేంద్రవర్మ, పరమ వీరచక్ర సినిమాల్లో మేజర్ పాత్రలు చేశారు. నిన్నే ప్రేమిస్తే, గగనం సినిమాల్లో నాగార్జున సైనికుడిగా నటించారు. కెప్టెన్ నాగార్జునలో నెవీ అధికారిగా నటించారు. మగాడు, రాజసింహ, ఎవడైతేనాకేంటి సిని మాల్లో డా.రాజశేఖర్ సైతం సైనికు డిగా నటించి మెప్పించారు. చంటి సినిమాలో రవితేజ సైనికుటిగా నటించారు. ఆది సాయికుమార్ కూడా కమెండోగా నటించాడు. ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ అనే చిత్రంలో ఈ తరహా పాత్ర చేశాడు. క్రిష్ దర్శక త్వం వహించిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ వీరసైనికుడి పాత్రని చేశారు. ఘాజీలో రానా నేవీ ఆఫీసర్‌గా నటించారు. 1971 భారత్, బంగ్లా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన యుద్ధభూమిలో మోహన్ లాల్, అల్లు శిరీష్ సైనికుడిగా నటించాడు. సాయికుమార్, జగపతిబాబు, కమల్‌హాసన్, రజనీకాంత్, వినోద్‌కుమార్, సుమన్, సుమంత్, మోహన్ బాబు, దాసరినారాయణరావు తదితరులు కూడా సైనికులుగా నటించి ప్రేక్షకాభిమనం చూరగొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.