హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లి ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో సినీ గ్లామర్‌ను ఉపయోగించుకునేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్నంత సినీ గ్లామర్ మరో పార్టీకి ఉండేది కాదు. అయితే ఇప్పుడు సినీ గ్లామర్‌ను ఉపయోగించుకుని ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ పార్టీ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు మార్లు ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తదితర అగ్రనటులు పలుమార్లు కలిశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో జీవిత, కవిత తదితర సినీ ఆర్టిస్టులు బీజేపీలో పదవుల్లో కొనసాగుతున్నారు.
అయితే ఆర్‌ఆర్‌ఆర్ పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో సిటీ అగ్రహీరోలు చిరంజీవి, రామ్‌చరణ్ ఢిల్లిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలోనూ చిరంజీవి, రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌కు విపరీతపమైన క్రేజ్ ఉండడంతో వీరి సేవలను రానున్న తెలంగాణ అసెంబ్లి ఎన్నికల్లో ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికీ ఏపీలో కొంత మేర ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం వీరంతా ఏపీలో జనసేన వైపుకు మళ్లారు.
మరి తెలంగాణలో ఇటు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ తరుపున ప్రచారం చేసేలా చేయాలన్న వ్యూహంతో బీజేపీ ఉన్నట్లు కీలక నేతలు చెబుతున్నారు. ఈ అగ్రహీరోలకు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. వీరి ఓట్లను బీజేపీకి వైపుకు తిప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో దేశమంతా బీజేపీ ప్రచారం చేయించే యోచనలో భావిస్తున్నట్లు తెలిపారు.