ఆంధ్రప్రభ స్మార్ట్, ఫిలిమ్‌నగర్ (హైదరాబాద్) : తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. చాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు పదవీ కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎన్నికలు జరిగాయి. ఈ సారి అధ్యక్ష పదవికి ఠాగూర్ మధు, భరత్ భూషణ్ పోటీపడ్డారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ పడగా అశోక్ కుమార్ విజయం సాధించారు.
రెండేళ్లకోసారి ఎన్నికలు..
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ప్రతి రెండేళ్లకోసారి ఎన్నుకుంటారు. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు ఓటర్లగా ఉంటారు. బైలా ప్రకారం దిల్ రాజ్ పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు.
డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి…
రెండేళ్ల కిందట నిర్మాతల సెక్టార్ నుంచి పోటీ ఉండగా.. సి.కల్యాణ్ ప్యానల్ పై దిల్ రాజు 17 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి.