Thursday, December 12, 2024

Mohan Babu | రిపోర్టర్ పై దాడి.. మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు

మీడియా ప్రతినిధిపై దాడి ఘటనపై మోహన్ బాబు మరో కీలక ప్రకటన చేశారు. గతంలో తన కుమారుడు మంచు మనోజ్‌ని ఉద్దేశించి ఆడియోను విడుదల చేసిన మోహన్ బాబు… ఈరోజు జర్నలిస్టుపై జరిగిన దాడికి సంబంధించిన వివరణతో ఆడియోను విడుదల చేశారు.

‘‘విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై అతని ఛానల్ లోగో మైక్ తీసుకుని దాడికి దిగిన ఘటనపై మోహన్ బాబు విచారం వ్యక్తం చేశారు. అయితే, తమ కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా అని మోహన్ బాబు ఈ ఆడియోలో ప్రశ్నించారు. నా ఇంట్లోకి దూసుకొచ్చిన వాళ్లు మీడియా వాళ్లా… ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. మీడియాను కొట్టాలనేది దైవసాక్షిగా నేను ఆలోచించలేదు.

చీకట్లో జరిగిన ఘర్షణ కారణంగా జర్నలిస్టుకు దెబ్బలు తగిలాయని మోహన్ బాబు తెలిపారు. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు తాను బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ రిపోర్టర్ కూడా తనకు తమ్ముడి లాంటి వాడన్నారు. అతని భార్యా పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

- Advertisement -

నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదని తెలిపారు. తన ధైర్యం సాహసమే అని, నీతిగా బతకాలనే తన ఆలోచన అన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే 50 కేసులు పెట్టుకోవచ్చని, అరెస్టు కూడా చేసుకోవచ్చని తెలిపారు. కానీ తన ఇంట్లోకి వచ్చి తన ప్రశాంతత భగ్నం చేశారన్నారు. తన బిడ్డే తన ప్రశాంతత చెడగొడుతున్నాడని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూర్చుని మాట్లాడుకుంటామని, ఏదో ఒక రోజు సమస్యలు పరిష్కారం అయిపోతాయని తెలిపారు. అందుకు మధ్యవర్తులు అవసరం లేదన్నారు.

అయితే తాను చేసినా సేవా కార్యక్రమాలు మర్చిపోయి దాడి ఘటననే పెద్దదిచేసి చూపుతున్నారని ఆరోపించారు. తాను కొట్టిన విషయం తప్పేనని, కానీ అక్కడ సందర్భం కూడా ఆలోచించాలన్నారు. తాను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాని అన్నారు. తను రిపోర్టర్ పై చేజేసుకుంది వాస్తవమే, అసత్యం కాదు… కాని తన విషయంలో మీడియా చూపిస్తుంది తప్పని ఎవరూ అడగటం లేదన్నారు. తాను చేసింది న్యాయమా, అన్యాయమా ప్రజలు ఆలోచించాలన్నారు. తన ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా?” అని ప్రశ్నించారు మోహన్ బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement