బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో మరణించినట్టు అతని తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ఇంటో ఉన్న సమయంలో ప్రభాకర్‌కు గుండెపోటు వచ్చిందని, ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై నగర శివారు తీర ప్రాంతంలోని క్రూజ్ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, మరికొంత మందిని అరెస్టు చేశారు. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలాను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ దర్యాప్తు సంస్థపై, అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో గోసవి-ఎన్సీబీ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని, వాంఖడే నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నార్కొటిక్ డ్రగ్స్ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశాడు. ఇక ఈ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్ మూడు వారాల తరువాత బెయిల్‌పై బయటికి వచ్చాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..