సంచలన దర్శకుడు శంకర్ కు అపరిచితుడు సినిమా నిర్మాత రవిచంద్రన్ లీగల్ నోటీస్ పంపారు. శంకర్ ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన అనుమతి లేకుండా తాను నిర్మించిన సినిమాను హిందీలో రీమేక్ చేస్తామని ప్రకటించటం పై రవిచంద్రన్ శంకర్ కు ఈ లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.
శంకర్ ప్రకటన వినగానే షాక్ కు గురయ్యానని పూర్తి కథాహక్కులు రచయిత సుజాత నుంచి తాను కొన్నానని అందుకు గాను పూర్తి పేమెంట్ కూడా చేశానని రవిచంద్రన్ అన్నారు. కాగా అంతకు ముందు రామ్ చరణ్ సినిమా ప్రకటించగానే లైకా ప్రొడక్షన్ వారు తమ ఇండియన్ 2 సినిమా పూర్తి కాకుండా వేరే ప్రాజెక్ట్ చేపట్టరాదని లీగల్ నోటీస్ లు ఇవ్వడం గమనార్హం. మరి ఈ నోటీసులకు శంకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.