దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హీరో నాగార్జున కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల (అక్టోబర్) 28న చిరంజీవికి అవార్డును అందజేస్తామని తెలిపారు. కాగా, ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిపారు.
సినీ రంగంలో విశిష్ట సేవలు అందించిన నటీనటులకు అక్కినేని అవార్డు ఇవ్వడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే అక్కినేని మరణానంతరం ఈ అవార్డు కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. ఇకపై ప్రతి సంవత్సరం లేదా రెండేళ్లకోసారి ఈ అవార్డును అందజేస్తామని నాగార్జున ప్రకటించారు.
కాగా, అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా చిరంజీవి స్పందించారు. అక్కినేని శత జయంతి సంవత్సరంలో ఈ అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. లెజెండరీ ఏఎన్ఆర్‌ని స్మరించుకుంటు… అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరని చెప్పారు. నటనా మేధావి, సినీ రంగానికి చెందిన ప్రముఖుడు, ఏఎన్నార్ చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో, మనస్సుల్లో చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం తనకు దక్కాయని అన్నారు.