తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు. సురేఖ వ్యాఖ్యలు విని షాక్ అయ్యానన్నారు. మంత్రిగా ఉండి ఆమె అలా మాట్లాడటం దారుణమన్నారు. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
తన కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని అమల అన్నారు. రాజకీయ నాయకులు నేరస్తులుగా వ్యవహరిస్తే ఈ దేశం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
“ఒక మహిళా మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? రాహుల్ గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మినట్లయితే.. దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి”. అని పోస్టు చేశారు.