ప్రముఖ నటి నమితకు తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయానికి వెళ్లిన తనను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారని… ఆలయ సిబ్బంది తనతో అగౌరవంగా మాట్లాడారని నమిత ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె వీడియో రూపంలో విడుదల చేసింది.
కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబ సమేతంగా మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లాను. నన్ను ఆలయంలోకి రాకుండా సిబ్బంది అడ్డుకున్నారు. నన్ను మా కుటుంబ సభ్యులను హిందూ కుల ధృవీకరణ పత్రం అడిగారు. ఈ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆలయ సిబ్బంది చాలా దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతో హిందువుని. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాను. నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని నమిత వీడియోలో కోరారు.
నమిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. నమితతో ఎవ్వరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడం. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాము. ఆ తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం అని తెలిపారు.