హైదరాబాద్, ఆంధ్రప్రభ : సమృద్ధిగా భూ గర్భజలాలు అందుబాటులో ఉండడం, ఇటు రిజర్వాయర్లు, పలు జిల్లాల్లోని చెరువులు, కుంటల్లో సాగునీరు సమృద్ధిగా ఉండి నిలకడగా నీటిమట్టాలు కొనసాగుతుండడంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ యాసంగిలో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ఒకప్పుడు వానాకాలంలోనే సాగునీటి కోసం బోర్లు వేసి అప్పులపాలై, చివరకు చుక్క నీరు రాక ఆత్మహత్యలకు ఒడిగట్టిన తెలంగాణ రైతన్నలు ఇప్పుడు యాసంగిలోనే సంతోషంగా యాసంగి వరినాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందుబాటులో ఉండడంతో రైతన్నల కళ్లలో ఆనందనాకి అవదులు లేకుండా పోయాయి. తెలంగాణ నుంచి ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైన ఎరగారు (ఏప్రిల్, మే నెలల్లో) వరిసాగు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లి ఊపందుకోవడం గమనార్హం.
గత యాసంగితో పోల్చుకుంటే ఈ యాసంగిలో వ్యవసాయశాఖ అంచనా వేసినదానికంటే దాదాపు 40శాతం మేర వరిసాగు పెరిగినట్లు తెలుస్తోంది. డిసెంబరు మూడో వారంతో మొదలుపెట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వరినాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 90శాతం యాసంగి వరినాట్లు పూర్తయ్యాయి. 2022-23 ఏడాది రబీ/యాసంగిలో వరినాట్లు ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విస్తారంగా సాగునీరు అందుబాటులో ఉండడంతో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, సోయా, వేరుశనగ,కూరగాయలు సాగు చేసే రైతులు కూడా వరిసాగుకు మళ్లారు. రాష్ట్రంలో ప్రతి ఏటా యాసంగిలో దాదాపు 30లక్షల ఎకరాలకు మించి వరినట్లు పడకపోయేవి.
ప్రస్తుతం 2022-23 యాసంగిలో సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు45లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు వ్యవసాయశాఖ అంచనా. ఈ నెల చివరి వరకు యాసంగి వరినాట్లకు అవకాశం ఉంది. మరో 5 నుంచి 8 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. విస్తారంగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రబీలో ఆరుతటి పంటలైన మొక్కజొన్న, వేరుశనగ, సోయా తదితర పంటలు కూడా గణనీయంగా సాగవుతున్నాయి.