ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నాయి. ముక్కు, మొహం తెలియని వారితో చాటింగ్ చేయడం ఫోన్లో మాట్లాడటం ఆఖరికి వారి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకోవడం ఇలా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఆన్ చాటింగ్ కారణంగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే నవీపేట్ మండలం కోస్లీ గ్రామ సర్పంచ్ విఠల్ తనయుడు శ్రీకాంత్ హైదరాబాదులోని పంజాగుట్టలో క్షత్రియ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో చదువుతున్నాడు. కాగా శ్రీకాంత్ కు ఇటీవల గుర్తు తెలియని యువతి మెసేజ్ చేసింది.
వెంటనే శ్రీకాంత్ ఆ నెంబర్ కు కాల్ చేశాడు. అలా అలా వీరి పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత సెక్స్ చాట్ లు, న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోలను రికార్డ్ చేసిన యువతి శ్రీకాంత్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను ఒక స్టూడెంట్ అని అంత డబ్బు ఇచ్చుకోలేనని… తన అకౌంట్లో ఉన్న 24వేల ను మాత్రమే ఇచ్చుకోగలను అని ఆమెకు పంపించాడు. కానీ యువతి మాత్రం లక్షల్లో డబ్బు ఇవ్వాలని లేకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించింది.
ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని హైదరాబాద్ నుంచి నేరుగా సొంత ఊరికి వచ్చి తమ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు శ్రీకాంత్. అపస్మారక స్థితిలో ఉన్నకొడుకుని తండ్రి ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు.