తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తోన్న కార్మికులు.. ఇండ్లు, ఇన్సురెన్స్, మరియు రేషన్ కార్డ్స్ కావాలని కోరుతూ ఫిబ్రవరి 14న షూటింగ్‌లకు సెలవు ప్రకటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి. సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ స్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ”తెలుగు టెలివిజన్ పరిశ్రమ గత 48 సంవత్సరాలుగా ఇంతితైవటుడింతై అన్నట్లుగా ఒక దూరదర్శన్ ఛానల్ నుంచి నేడు 143 శాటిలైట్ ఛానల్స్ స్థాయికి ఎదిగింది. నాడు కేవలం 16 మందితో ప్రారంభమైన దశ నుంచి, నేడు సుమారు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఒక లక్షా 48వేల మంది కార్మికులు టెలివిజన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వారంతా తమతమ క్రాఫ్ట్‌లను, యూనియన్లుగా, అసోషియేషన్లుగా ఏర్పరచుకున్నారు. ఆ యూనియన్లు అన్నీ కలిసి గత 12 సంవత్సరాల క్రితం ఈ సంస్థను ఏకగ్రీవంగా ఏర్పరచుకున్నాయి. అన్ని క్రాఫ్ట్‌లలోని కార్మికులందరూ కడుతున్న సర్వీస్ ట్యాక్స్, టి.డి.ఎస్, జి.ఎస్.టి ల ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి సుమారు 1800 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. ఇందులో కనీసం ఒక శాతం కూడా ప్రభుత్వం ఈ పరిశ్రమ సంక్షేమానికి ఖర్చు చేయడం లేదు. ఇది చాలా విచారకరం. మా పరిశ్రమకు చాలా కాలంగా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మా డిమాండ్లను ముక్తకంఠంతో ఒక వేదిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించాలని అనుకుంటున్నాం. రాష్ట్ర మంత్రులను, పరిశ్రమ పెద్దలను ఆహ్వానించి ఒక భారీ సభను ఫిబ్రవరి 14న నిర్వహించాలనుకుంటున్నాం. ఆ రోజు షూటింగ్ సెలవుగా ప్రకటించడం జరిగింది. ఇందుకు నిర్మాతల మండలి సహకారం కూడా లభించింది. అధిక సంఖ్యలో టెలివిజన్ కార్మికులు ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నానని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement