తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై మెగాస్టార్ స్పందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా దేశ స్థితిగతులను మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..’నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు భారతరత్న రావడం మనందరికీ గర్వకారణం, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని మార్చివేశారు.
ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే. తాను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరితో పాటు తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం. ఈ గౌరవం లభించడం ఆలస్యమైనప్పటికీ.. ఇంతకు మించిన గొప్పది ఏమీ ఉండదు.’ అని పోస్ట్ చేశారు. కాగా.. చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష కనిపించనుంది.