ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన ప్రత్యేక సమావేశం

  • రేపు చౌటుప్పల్‌లో సమావేశం.. ప్రచార వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చ

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ : వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తరఫున ఉమ్మడి నల్లగొండ జిల్లా జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 4న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా నాయకుడు ఆముదాల పరమేశ్‌ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని జయశ్రీ గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావును పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. సమావేశానికి రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్‌, ప్రచార కమిటీ కార్యదర్శి ఆర్‌.కె. సాగర్‌, జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్‌ మచ్చ సుధాకర్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి, పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై సమీక్షించనున్నట్లు ఆముదాల పరమేశ్‌ చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కోఆర్డినేటర్లు, జనసైనికులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.