చౌటుప్పల్‌లో పూజారి దారుణ హత్య..

మూడు గంటల్లోనే కేసు ఛేదన

రూ.1.73 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, కారు స్వాధీనం
హిమాచల్‌/నాగ్‌పూర్‌ వైపు పారిపోతుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితుల అరెస్ట్‌

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్‌ పట్టణంలో కలకలం రేపిన పూజారి రాళ్లబండి సుధాకర్‌ స్వామి దారుణ హత్య, భారీ చోరీ కేసును పోలీసులు కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడి కోట్లాది రూపాయల విలువైన సొత్తుతో పారిపోతున్న ఇద్దరు నిందితులను నిర్మల్‌ జిల్లా గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్‌ డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ ఘటన వివరాలను వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే సుధాకర్‌ స్వామి ఇంట్లో దేవుడి పూజలు, కొలుపులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన వద్దకు వచ్చే భక్తులు కానుకలుగా సమర్పించిన బంగారం, నగదు ఇంట్లో ఉండేవి.

అక్టోబర్‌ 31వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సుధాకర్‌ స్వామితో ఆయన మేనమామ వరుసయ్యే గుర్రం సురేష్‌ ఫోన్‌లో మాట్లాడాడు. ఆ సమయంలో పవన్‌, హర్షు అనే ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చారని సుధాకర్‌ స్వామి చెప్పాడు. అనంతరం అర్ధరాత్రి 12.38 గంటలకు సుధాకర్‌ స్వామి ఫోన్‌ నుంచి రెండు వాట్సాప్‌ వాయిస్‌ సందేశాలు రావడంతో సురేష్‌కు అనుమానం వచ్చింది. ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా అవి పనిచేయకపోవడంతో వెంటనే సుధాకర్‌ స్వామి ఇంటికి వెళ్లి చూశాడు. ఇంటి గేటు, తలుపులు తెరిచి ఉండటంతో పాటు ఇంట్లో పార్క్‌ చేసిన టాటా సఫారీ కారు కనిపించలేదు. దీంతో రాత్రి 1.36 గంటలకు డయల్‌ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న చౌటుప్పల్‌ పోలీసులు మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌లో సుధాకర్‌ స్వామి చేతులు, కాళ్లు చీరలతో కట్టేసి, కత్తిపోట్లతో హత్యకు గురై ఉండటాన్ని గుర్తించారు.

మూడు గంటల్లోనే పోలీసుల మెరుపు వ్యూహం

బాధితుడి ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 609/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, చౌటుప్పల్‌ డీఎస్పీ పి. మధుసూదన్‌రెడ్డి సూచనలతో రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ దేవిరెడ్డి సతీష్‌రెడ్డి, ఎస్సైలు కనకటి యాదగిరి, రవీందర్‌, అజయ్‌ భార్గవ్‌ తమ సిబ్బందితో కలిసి దొంగిలించిన టాటా సఫారీ (టీజీ 30 ఏ 5659) కారు కదలికలను సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. కారు నాగ్‌పూర్‌ హైవే వైపు వెళ్తున్నట్లు గుర్తించి జాతీయ రహదారి-44పై ఉన్న టోల్‌ప్లాజాల సిబ్బందితో పాటు నిర్మల్‌ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో నవంబర్‌ 1వ తేదీ ఆదివారం ఉదయం 4.05 గంటలకు నిర్మల్‌ జిల్లాలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద నిందితులను వాహనంతో సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితులు

  1. పవన్‌ కుమార్‌ (21), సాహు (తేలి), స్వస్థలం సొలోంగ్‌, సింగ్రౌలి జిల్లా, మధ్యప్రదేశ్‌.
  2. హర్ష్‌ సంతోష్‌ పాండే (24), పండిట్‌, స్వస్థలం సత్నా, మధ్యప్రదేశ్‌.

స్వాధీనం చేసుకున్న సొత్తు

మొత్తం విలువ రూ.1,73,63,300గా పోలీసులు వెల్లడించారు. ఇందులో 1 కిలో 319.33 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ.1.30 కోట్లు), 3 కిలోల 600.66 గ్రాముల వెండి వస్తువులు (విలువ రూ.3.60 లక్షలు), రూ.9,03,300 నగదు, రూ.30 లక్షల విలువైన టాటా సఫారీ కారు ఉన్నాయి. వీటితో పాటు హత్యకు ఉపయోగించిన 23 అంగుళాల కత్తి, ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌, రియల్‌మీ 12 ప్రో ప్లస్‌, బాధితుడి ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. నిందితులను నిర్మల్‌ 1వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరిచిన అనంతరం చౌటుప్పల్‌ జేఎఫ్‌సీఎం కోర్టులో ప్రవేశపెట్టారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు

నేరం జరిగిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని రూ.1.73 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్‌ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, హెచ్‌జీలు, చాకచక్యంగా సహకరించిన నిర్మల్‌ జిల్లా పోలీసులను ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ ప్రత్యేకంగా అభినందించారు.