చౌటుప్పల్‌లో ఘనంగా పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

వృద్ధులకు 80 చేతికర్రలు, స్టాండ్ల పంపిణీ.. సేవా కార్యక్రమాలతో జనసేన సందడి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని జయశ్రీ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 80 మంది వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్లను పంపిణీ చేశారు. జనసేన నాయకులు ఆముదాల పరమేశ్‌ నేతృత్వంలో, బడుగు శ్రీరాములు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జి మేకల సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి, ఆముదాల పరమేశ్‌ మాట్లాడుతూ సమాజ సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలకు అనుగుణంగా ఆయన జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.

అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చేతికర్రలు, స్టాండ్లు అందుకున్న వృద్ధులు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పీక ప్రవీణ్‌కుమార్‌, పల్చం శ్రీకాంత్‌, బొల్లం మల్లేశ్‌, పెద్దగోని లింగస్వామి, ప్రశాంత్‌, బద్రి రాజు, కునూరు శ్రీకాంత్‌ సంజయ్‌, కృష్ణారెడ్డి, సుల్తాన్‌రాజు, రమణబాబు, శివరామ్‌, నిఖిల్‌, తేజతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.