గంజాయి సేవిస్తున్న ఐదుగు రుపై కేసు నమోదు..

  • చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్‌ గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్‌ తెలిపారు.

శనివారం విధుల్లో ఉన్న రెండో ఎస్సై ఓంపాల్‌కు జూకల్‌ గ్రామ శివారులోని కెనాల్‌ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కొంతమంది గంజాయి సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో ఆయన పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఐదుగురిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.

చల్లగరిగ గ్రామానికి చెందిన మేదరి ప్రశాంత్‌, దూడపాక ప్రకాశ్‌, బైస బన్నీ, కుంచం బన్నీ, ముచినిపర్తి గ్రామానికి చెందిన పసరగొండ సంజయ్‌రాజ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి వినియోగించినట్లు పాజిటివ్‌ నివేదిక వచ్చినట్లు ఎస్సై తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పోచంపల్లి సతీష్‌ హెచ్చరించారు.