పంట పనులు కరువు.. ఉపాధి పనులే భరోసా
వానలు ముఖం చాటేయడంతో గ్రామీణ కూలీలకు అండగా ఉపాధి హామీ పనులు
చిత్తూరు, ఆంధ్రప్రభ : వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడంతో గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పనులే ఆధారంగా మారుతున్నాయి. పొలం పనులు తగ్గిపోవడం, వ్యవసాయ కూలీలకు రోజువారీ పనులు దొరకకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్పిస్తున్న ఉపాధి పనుల వైపు పెద్ద సంఖ్యలో అడుగులు వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నమోదైన పని దినాలు భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం.
2025 ఆగస్టులో చిత్తూరు జిల్లాలో 2,88,378 పని దినాలు నమోదు కాగా, 2026 ఆగస్టులో ఈ సంఖ్య 4,11,676కు చేరింది. అంటే ఏడాదిలో 1,23,298 పని దినాలు అదనంగా నమోదయ్యాయి. శాతంలో చూస్తే 42.7 శాతం పెరుగుదల కనిపించింది. సెప్టెంబరు 1 నాటికి జిల్లాలో 89,048 మంది వేతనదారులు ఉపాధి పనుల్లో పాల్గొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జిల్లాలోని 27 మండలాల్లో చాలాచోట్ల గత ఏడాదితో పోలిస్తే ఈసారి పని దినాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యాదమరి మండలంలో 2025 ఆగస్టులో 4,865 పని దినాలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 26,150కు చేరాయి. బైరెడ్డిపల్లెలో 6,698 నుంచి 19,646కు, నింద్రలో 3,948 నుంచి 19,712కు పెరిగాయి.
కార్వేటినగరంలో 9,545 నుంచి 20,591కు, గుడిపల్లెలో 15,292 నుంచి 20,518కు పని దినాలు చేరాయి. బంగారుపాళ్యంలో 5,421 నుంచి 14,587కు, జీడీ నెల్లూరులో 5,319 నుంచి 13,766కు, ఇరాలలో 6,035 నుంచి 13,918కు పెరిగాయి. పెనుమూరు, శాంతిపురం, వెదురుకుప్పం తదితర మండలాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే పని దినాలు పెరిగాయి.
అయితే కొన్ని మండలాల్లో మాత్రం పని దినాలు తగ్గాయి. కుప్పంలో 33,769 నుంచి 29,018కు, రామకుప్పంలో 27,668 నుంచి 24,888కు తగ్గాయి. పులిచెర్లలో 16,054 నుంచి 7,358కు, రొంపిచెర్లలో 25,291 నుంచి 13,226కు పడిపోయాయి. స్థానిక వ్యవసాయ పరిస్థితులు, అందుబాటులో ఉన్న పనులు, కూలీల అవసరాలు మండలాలవారీగా భిన్నంగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
వ్యవసాయ పనులు తగ్గడంతో..
చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. వర్షాలు సకాలంలో లేకపోవడం, సాగునీటి లభ్యతలో ఇబ్బందులు, పంటల సాగు తగ్గడం వంటి పరిస్థితులు వ్యవసాయ కూలీలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా పంటల సాగు, కలుపు, నాట్లు, కోత వంటి పనులతో ఉపాధి పొందే కూలీలకు వ్యవసాయ రంగంలో పని తగ్గడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు వారికి కొంత ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి.
వలసకు బదులు ఊరిలోనే పని
వ్యవసాయ పనులు లేకపోవడంతో గ్రామీణ కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లడం, ప్రయాణం, నివాసం వంటి అదనపు ఖర్చులు భరించడం కష్టంగా మారుతోంది. దీంతో సొంత గ్రామంలోనే ప్రభుత్వ పనులు లభిస్తే వాటినే చేసుకునేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరుగుతోంది.
125 రోజుల పనిపై ఆశలు
ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్–జీ రామ్ జీగా మార్చడంతో పాటు పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం, కూలీ చెల్లింపులను వేగవంతం చేయడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొనబడింది. వ్యవసాయ పనులు అందుబాటులో లేని సమయంలో ప్రభుత్వ పనులు లభించడం గ్రామీణ కుటుంబాలకు ఉపయోగకరంగా మారనుంది.
జిల్లాలో ప్రస్తుతం 2,23,279 జాబ్ కార్డులు, 1,72,843 క్రియాశీల జాబ్ కార్డులు, 2,75,278 క్రియాశీల వేతనదారులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 34,76,959 వ్యక్తి పని దినాలు నమోదయ్యాయి.
మొత్తంగా చూస్తే వర్షాభావం కారణంగా వ్యవసాయ పనులు తగ్గడం, గ్రామీణ కుటుంబాలకు నిరంతర ఆదాయం అవసరం, వలసలకు బదులు స్థానికంగా ఉపాధి పొందాలన్న ఆకాంక్ష వంటి అంశాలు ఉపాధి హామీ పనుల డిమాండ్‌ను పెంచుతున్నాయి. గత ఆగస్టుతో పోలిస్తే ఈసారి పని దినాలు 42.7 శాతం పెరగడం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులపై పెరుగుతున్న ఆధారపడటాన్ని స్పష్టంగా చూపుతోంది.
