Chittoor | డీకే ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్ట్
- రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ చర్యలు..
- ఐదేళ్ల తర్వాత కుటుంబానికి బిగ్ షాక్..
Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబానికి ఐదేళ్ల తర్వాత ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు డీఏ శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు అప్పటి దర్యాప్తు అధికారి, ప్రస్తుతం కర్ణాటక మానవ హక్కుల కమిషన్ డీఎస్పీగా (DSP) పని చేస్తున్న మోహన్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి పలు తీవ్రమైన అభియోగాల కింద ఈ అరెస్టులు జరిగాయి.
బెంగళూరులోని మార్తహళ్లి ప్రాంతంలో ఉన్న వారి నివాసంలో సోమవారం సీబీఐ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. కర్ణాటక (Karnataka) హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నమోదు చేసిన కేసుల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. 2019 నాటి సంచలన రియల్ ఎస్టేట్ వ్యాపారి కే రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసే ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రబిందువుగా మారింది.

డీకే ఆదికేశవులు నాయుడు బెంగళూరు (Bangalore) , చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఆస్తులు కలిగి ఉండేవారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రఘునాథ్ కూడా బెంగళూరు పరిసరాల్లో పలు స్థిరాస్తులకు యజమాని. 2013లో ఆదికేశవులు నాయుడు మరణించిన అనంతరం, ఆయనకు చెందిన అనేక ఆస్తులను రఘునాథ్ తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆస్తులన్నీ తమ తండ్రివేనని, తాము చట్టబద్ధమైన వారసులమని చెబుతూ శ్రీనివాస్, కల్పజ, మరికొందరు రఘునాథ్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని బాధితుల వాదన.
రఘునాథ్ పేరు మీద ఉన్న ఆస్తుల ఆదాయ వనరులు కూడా తమ తండ్రివేనని శ్రీనివాస్ (Srinivas) డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్తులతో పాటు ఆదాయాన్ని కూడా తమకు బదిలీ చేయాలని పట్టుబట్టినట్లు రఘునాథ్ కుటుంబం పేర్కొంది. ఈ ఆస్తి తగాదాలే చివరకు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్యే 2019 మే నెలలో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌లో రఘునాథ్ ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. మొదట ఈ ఘటనను అసహజ మరణంగా నమోదు చేశారు. రఘునాథ్ (Ragunath) మరణం తర్వాత ఆయన కుమారుడు కేసు నమోదు చేయగా, 2020 ఫిబ్రవరిలో రఘునాథ్ భార్య మంజుల సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి తగాదాల కారణంగానే తన భర్తను శ్రీనివాస్‌తో పాటు మరికొందరు కిడ్నాప్ చేసి హత్య చేశారని, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో శ్రీనివాస్‌తో పాటు దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తుల పేర్లను కూడా మంజుల ప్రస్తావించారు. రఘునాథ్ ఆస్తులను నకిలీ స్టాంప్ పేపర్ల (Stamp Papers) ద్వారా రాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఈ కేసులో ప్రధానంగా ఉన్నాయి. రఘునాథ్ కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూముల వ్యాపారం చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
అయితే.. అప్పట్లో ఈ కేసును విచారించిన అప్పటి ఇన్‌స్పెక్టర్ మోహన్, రఘునాథ్‌ది ఆత్మహత్యేనని తేలుస్తూ కోర్టుకు బీ–రిపోర్ట్ సమర్పించారు. అనంతరం హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో న్యాయం జరగలేదని భావించిన మంజుల మరోసారి హైకోర్టును (High court) ఆశ్రయించారు. చివరకు హైకోర్టు ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

ప్రస్తుతం సీబీఐ చెన్నై విభాగం ఆధ్వర్యంలో ఈ కేసు లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే అప్పటి పోలీసు (police) అధికారి మోహన్ దర్యాప్తును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిని న్యాయస్థానంలో హాజరుపర్చగా, రిమాండ్ విధించి హరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించినట్లు సమాచారం.
డీకే ఆదికేశవులు నాయుడు (Dk Aadi Kesavula Naidu) కుమారుడు శ్రీనివాస్ ఎక్కువగా బెంగళూరులోనే నివసిస్తూ రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సీబీఐ అరెస్టులతో ఒక్కసారిగా రాజకీయ, వ్యాపార, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఐదేళ్లుగా ముసుగులో ఉన్న ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగిందని, రఘునాథ్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

