TG | హైటెక్స్‌లో ఈనెల14, 15న సదస్సు…

TG | హైటెక్స్‌లో ఈనెల14, 15న సదస్సు…

మెగాస్టార్‌ ఆశీస్సులు తీసుకున్న సమాఖ్య ప్రతినిధులు


TG | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ హైటెక్స్‌లో అక్టోబర్‌ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సమాఖ్య ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ మీట్‌కు మెగాస్టార్‌, పద్మవిభూషణ్‌ డాక్టర్‌ కొణిదెల చిరంజీవిని ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు సమాఖ్య సభ్యులు చిరంజీవిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

సమాఖ్య సభ్యులు పి.వి.రావు, టి.వి.ఎన్‌.రావు, చింతల పార్థసారథి, ఏవీ రత్నం, అరవ రామకృష్ణ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైటెక్స్‌లో జరగనున్న గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ కార్యక్రమ వివరాలను ఆయనకు వివరించారు.

వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై సదస్సులో చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడం పట్ల సమాఖ్య సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఆశీస్సులతో సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.