గురువులకు ఘన గౌరవం.. 81 మందికి సన్మానం
తల్లిదండ్రుల తర్వాత గురువే.. వారిని గౌరవించడం మనందరి బాధ్యత: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరు, ఆంధ్రప్రభ: దెందులూరు నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం లభించింది. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల ఆడిటోరియంలో గురుపూజోత్సవ సత్కార వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విశేష ప్రతిభ కనబరిచిన 81 మంది ఉపాధ్యాయులను శాలువాలు, మెమెంటోలు, అభినందన పత్రాలతో సత్కరించారు. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల నుంచి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు, అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలు, సుదీర్ఘకాలం సేవలందించి ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సన్మానం అందుకున్నారు. ప్రత్యేక అవార్డు గ్రహీతలుగా శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్‌తో పాటు మరో ఇద్దరిని సత్కరించారు. మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ప్రారంభం కాగా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువే కీలకమని, అటువంటి వారి సేవలను గుర్తించి సత్కరించడం, ప్రోత్సహించడం అందరి బాధ్యత అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ కార్యక్రమాన్ని అభినందించారు. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ డైరెక్టర్ ఉప్పలపాటి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ గురువుల ఆత్మగౌరవాన్ని పెంచేలా, వారి జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలేలా వేడుక నిర్వహించామని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీతలు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఉపాధ్యాయులకు వడ్డించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బొప్పన సుధా, ట్రస్ట్ డైరెక్టర్ చింతమనేని నవ్యశ్రీ, విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
