China-West-Asia-Strategy : డ్రాగన్ దూకుడు ! Andhra Prabha Top Story
China-West-Asia-Strategy : డ్రాగన్ దూకుడు ! Andhra Prabha Top Story
- ఈజిప్టుతో అనుబంధం
- అరబ్ దేశాలతో దౌత్యం
- టెహ్రన్‌తో వాఫింగ్గన్ యుద్ధం ఫలితం
- పశ్చిమాసియాలో అమెరికాకు ఎసరు
( ఆంధ్రప్రభ, బీజింగ్ )

కైరో: పశ్చిమాసియా సంక్షోభం ముదురుతున్న వేళ.. ఆ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించి, తనదైన ముద్ర వేయడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఈజిప్టులో పర్యటించిన ఆయన.. యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్న శక్తిగా, మూసుకుపోయిన జలమార్గాలతో ఆర్థికంగా దెబ్బతిన్న దేశాల కష్టాలను అర్థం చేసుకునే భాగస్వామిగా, ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రపంచ శక్తిగా చైనాను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
పశ్చిమాసియాలో అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న జిన్‌పింగ్ ప్రయత్నాల్లో ఈ పర్యటన మరో కీలక అడుగు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు ఈ ప్రాంతంలో మరింత అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే.. చైనా దూకుడు కేవలం ట్రంప్ విధానాలకు ప్రతిస్పందన మాత్రమే కాదు. అమెరికా నేతృత్వంలోని భద్రత, ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా చైనాను నిలబెట్టాలన్నది జిన్‌పింగ్ కొన్నేళ్లుగా సాగిస్తున్న వ్యూహం.
నమ్మకం బాటలో డ్రాగన్
పశ్చిమాసియాలో పెరుగుతున్న దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. భారీగా పెట్టుబడులు పెట్టగల ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి చెందిన రక్షణ పరిశ్రమ, పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు.. ఇవన్నీ జిన్‌పింగ్‌కు కలిసొస్తున్నాయని తక్షశిల సంస్థకు చెందిన చైనా పరిశోధకురాలు అనుష్క సక్సేనా పేర్కొన్నారు.
దశాబ్దాలుగా పశ్చిమాసియా దేశాలు అమెరికాతో భద్రతా సంబంధాలను కొనసాగించాయి. అమెరికా తమకు భద్రతా హామీగా నిలుస్తుందన్న నమ్మకంతోనే అవి వాషింగ్టన్‌కు దగ్గరగా ఉన్నాయి. కానీ అమెరికా-ఇరాన్ యుద్ధం సుదీర్ఘమవుతున్న కొద్దీ ఆ భద్రతా హామీపై సందేహాలు పెరుగుతున్నాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం ప్రమాదకరంగా మారడం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల కోసం అరబ్ దేశాలు చైనా వైపు మరింతగా చూస్తున్నాయని విశ్లేషణ.
ట్రంప్ వైఖరికి భిన్నంగా..
పశ్చిమాసియాలో అమెరికా ప్రాధాన్యాన్ని దేశాలు పునఃపరిశీలిస్తున్న సమయంలో.. జిన్‌పింగ్ మాత్రం తన మాటలతో ప్రాంతీయ దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దేశాల జోక్యాన్ని తిరస్కరించి.. తమ వ్యవహారాలను తామే నిర్ణయించుకోవాలని పశ్చిమాసియా దేశాలకు పిలుపునిచ్చారు.
గాజా, వెస్ట్‌బ్యాంక్ విషయంలో ట్రంప్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న తరుణంలో.. పాలస్తీనా సమస్య పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన అంశమని, దాన్ని పక్కన పెట్టరాదని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
అదే సమయంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి చైనా మద్దతు ప్రకటించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూసివేత, ఎర్ర సముద్రంలో ఏర్పడుతున్న ముప్పు.. ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ఈ అంశాన్ని జిన్‌పింగ్ ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీసీతో జిన్‌పింగ్ జోడీ
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీని పశ్చిమాసియాలో తన వ్యూహానికి కీలక భాగస్వామిగా జిన్‌పింగ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘విన్-విన్’ భాగస్వామ్యంగా ఇరువురు నేతలు అభివర్ణిస్తున్నారు.
ఈజిప్టు ఆటోమొబైల్ రంగంలో చైనా పెట్టుబడులు పెడుతోంది. ప్రజా మౌలిక వసతుల నిర్మాణంలో సహకరిస్తోంది. ఫ్రాన్స్ రఫేల్ విమానాలకు పోటీగా నిలిచే యుద్ధ విమానాలను కూడా ఈజిప్టుకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిగా పశ్చిమాసియాలో చైనా చేపడుతున్న దౌత్య కార్యక్రమాలకు ఈజిప్టు మద్దతు ఇస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు పాకిస్థాన్ నేతృత్వంలో జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఈజిప్టు మద్దతు ఇచ్చింది. అదే సమయంలో టర్కీ, సౌదీ అరేబియాతో కలిసి శాంతి మార్గాన్ని అన్వేషించే ప్రయత్నాల్లోనూ ఈజిప్టు భాగస్వామిగా ఉంది.
సూయెజ్ కారణంగానే
సూయెజ్ కాలువపై కీలక భౌగోళిక స్థానం కలిగిన ఈజిప్టుకు చైనాతో సన్నిహిత సంబంధాలు వ్యూహాత్మకంగా ఉపయోగపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. సరఫరా మార్గాలకు భద్రత కల్పించుకోవడం, ప్రాంతీయ శాంతి ప్రయత్నాలకు ఒక అగ్రరాజ్య ఆర్థిక, దౌత్య మద్దతు పొందడం.. ఈజిప్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని వారి అభిప్రాయం.
మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పశ్చిమ దేశాల పాత్ర తగ్గడం, కీలక సముద్ర వాణిజ్య మార్గాలను మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలున్నా ట్రంప్ వెనుకాడకపోవడం.. పశ్చిమాసియా దేశాలను చైనా వైపు వేగంగా మళ్లిస్తున్న రెండు ప్రధాన కారణాలని సక్సేనా పేర్కొన్నారు.
మిగతా దేశాలకూ ఇదే బాట?
ఈజిప్టుతో చైనా పెంచుకుంటున్న సంబంధాలు.. పశ్చిమాసియాలోని ఇతర దేశాలతో బీజింగ్ అనుసరించబోయే వ్యూహానికి నమూనాగా మారే అవకాశముంది. సౌదీ అరేబియాతో పాకిస్థాన్‌కు ఉన్న పరస్పర రక్షణ ఒప్పందం నేపథ్యంలో.. చైనా నుంచి ఆధునిక సైనిక సాంకేతికతను సౌదీ కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ సహకరించాల్సి ఉంది.
ఇక ఈజిప్టుతో మాత్రం చైనా బహిరంగంగానే రక్షణ సంబంధాలను విస్తరిస్తోంది. ఇటీవల తొలిసారిగా జరిగిన చైనా-ఈజిప్టు సంయుక్త వైమానిక సైనిక విన్యాసాల్లో చైనా భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు, బహుళ ప్రయోజన విమానాలు, డ్రోన్లను ఈజిప్టుకు తరలించింది. ఈ నేపథ్యంలో ఈజిప్టు తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు చైనా నుంచి భారీగా యుద్ధ విమానాలు, డ్రోన్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని సక్సేనా అంచనా వేశారు.
అరబ్ ప్రపంచంలో కొత్త భద్రతా వ్యవస్థ?
అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న ఈజిప్టు.. చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటే, పశ్చిమాసియాలో కొత్త భద్రతా వ్యవస్థకు జిన్‌పింగ్ చేస్తున్న ప్రతిపాదనకు సీసీ మద్దతు ఇవ్వడం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ దేశాల జోక్యం తక్కువగా ఉండేలా.. అరబ్ దేశాలే తమ ప్రాంతీయ భద్రత, రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈజిప్టుకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
పాకిస్థాన్.. మరో బలం
పశ్చిమాసియాలో చైనాకు ఈజిప్టు ఒక ప్రవేశ ద్వారంగా మారుతుంటే.. ఆ ప్రభావాన్ని మరింత విస్తరించడంలో పాకిస్థాన్ కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రాంతీయ దేశాలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలన్న విధానానికి చైనా మద్దతు ప్రకటిస్తోంది. ‘ఇతర దేశాల జోక్యం వద్దు.. సార్వభౌమత్వాన్ని గౌరవించాలి’ అన్న సిద్ధాంతాన్ని ముందుకు తెస్తోంది.
ఈ విధానానికి పాకిస్థాన్ మద్దతు ఇవ్వడమే కాకుండా.. చైనా ప్రాంతీయ శక్తిగా ఎదగడానికి అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తోంది. దీంతో చైనా-పాకిస్థాన్ మధ్య దౌత్య సమన్వయం మరింత బలపడుతోంది. టర్కీ, సౌదీ అరేబియాలతోనూ ఈ రెండు దేశాలు కలిసి.. యుద్ధానంతర పశ్చిమాసియా ఎలా ఉండాలన్న అంశంపై ఒకే రకమైన అభిప్రాయాలను ముందుకు తెస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. అమెరికా-ఇరాన్ ఘర్షణ పశ్చిమాసియాలో కేవలం యుద్ధ సమీకరణాలనే కాదు.. భవిష్యత్తు భద్రత, ఆర్థిక, దౌత్య వ్యవస్థ రూపురేఖలనూ మార్చే పరిస్థితిని సృష్టిస్తోంది. అమెరికా ప్రభావం తగ్గుతున్న కొద్దీ.. ఆ ఖాళీని పూడ్చేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తుండటం ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తోంది.
