China Masters 2026 | సెమీస్‌లో సాత్విత్‌–చిరాగ్‌..

షెన్‌జెన్‌, ఆంధ్రప్రభ : భారత స్టార్‌ పురుషుల డబుల్స్‌ జోడి సాత్విక్సాయిరాజ్‌ రంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి చైనా మాస్టర్స్‌ 2026లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన 70 నిమిషాల ఉత్కంఠభరిత క్వార్టర్‌ఫైనల్లో నాలుగో సీడ్‌ సాత్విత్‌–చిరాగ్‌ జోడి డెన్మార్క్‌కు చెందిన కిమ్‌ ఆస్ట్రప్‌–ఆండర్స్‌ స్కారప్‌ రాస్ముస్సెన్‌పై 21-13, 16-21, 21-18తో విజయం సాధించింది. ఈ గెలుపుతో చైనా మాస్టర్స్‌లో వరుసగా నాలుగోసారి సెమీస్‌ చేరిన ఘనతను సొంతం చేసుకుంది.

తొలి గేమ్‌లో భారత జోడీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మ్యాచ్‌ మొదలైన ఐదు నిమిషాల్లోనే 11-4తో ఏడు పాయింట్ల ఆధిక్యాన్ని అందుకుంది. విరామం తర్వాత డెన్మార్క్‌ జోడీ కొంత ప్రతిఘటన చూపినా.. సాత్విత్‌–చిరాగ్‌ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయలేకపోయింది. కేవలం 16 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను 21-13తో సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లో మాత్రం డెన్మార్క్‌ జోడీ పుంజుకుంది. సాత్విత్‌–చిరాగ్‌కు పెద్ద ఆధిక్యం దక్కకుండా ఆస్ట్రప్‌–రాస్ముస్సెన్‌ గట్టి పోటీ ఇచ్చారు. మధ్య విరామ సమయానికి భారత జోడీ 11-10తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నా.. 15-15 వద్ద డెన్మార్క్‌ ఆటగాళ్లు వరుసగా మూడు పాయింట్లు సాధించి 18-15తో ముందంజ వేశారు. అనంతరం నాలుగు గేమ్‌ పాయింట్లు సాధించి తొలి అవకాశాన్నే ఉపయోగించుకుని రెండో గేమ్‌ను 21-16తో గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక గేమ్‌కు తీసుకెళ్లారు.

మూడో గేమ్‌లో పోరు మరింత రసవత్తరంగా మారింది. డెన్మార్క్‌ జోడీ 6-3, 9-6తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయానికి 11-9తో ముందంజలో ఉంది. సాత్విత్‌–చిరాగ్‌ రెండుసార్లు ప్రత్యర్థులను అందుకునే ప్రయత్నం చేసినా.. ఆస్ట్రప్‌–రాస్ముస్సెన్‌ ఆధిక్యాన్ని కొనసాగించారు. చివరకు 17-17 వద్ద 36 షాట్ల సుదీర్ఘ ర్యాలీని గెలుచుకుని భారత జోడీ స్కోరును సమం చేసింది.

ఆ తర్వాత సాత్విత్‌–చిరాగ్‌ జోడి మ్యాచ్‌పై పట్టు బిగించింది. కొద్దిసేపటికే మూడు మ్యాచ్‌ పాయింట్లు సాధించి.. రెండో మ్యాచ్‌ పాయింట్‌ను సద్వినియోగం చేసుకుని 21-18తో నిర్ణయాత్మక గేమ్‌ను ముగించింది. దీంతో 70 నిమిషాల థ్రిల్లర్‌లో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

సెమీస్‌లో మలేషియా జోడీతో ఢీ

సెమీఫైనల్లో సాత్విత్‌–చిరాగ్‌ జోడీ మలేషియాకు చెందిన నూర్‌ అజ్రియిన్‌–టాన్‌ వీ కియోంగ్‌తో తలపడనుంది. ఇండోనేషియాకు చెందిన ఆరో సీడ్‌ సబర్‌ కర్యమాన్‌ గుటామా–మొహ్‌ ఇష్‌ఫహానీ జోడీని 21-17, 16-21, 21-19తో ఓడించి మలేషియా జోడీ సెమీస్‌ చేరుకుంది.