China-Laos-Joint-Training-Center: లావోస్‌లో చైనా పాగా Andhra Prabha Top Story
China-Laos-Joint-Training-Center: లావోస్‌లో చైనా పాగా Andhra Prabha Top Story
- శిక్షణ కేంద్రం బురఖాలో సైనిక స్థావరం..!
- కొత్త జాయింట్ ట్రైనింగ్ సెంటర్‌కు యుద్ధ విమానాలు
- రన్ వేపై 8 కే-8 విమానాలు
- 20కిపైగా సైనిక వాహనాలు
- ఇది గతంలె అమెరికా స్థావరం
- ఆగ్నేయాసియాలో చైనా తొలి విదేశీ సైనిక స్థావరం?

హాంకాంగ్/బ్యాంకాక్, ఆంధ్రప్రభ ప్రతినిధి)
ఆగ్నేయాసియాలో చైనా సైనిక ఉనికి మరింత విస్తరిస్తోందా? లావోస్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంయుక్త సైనిక శిక్షణ కేంద్రంలోకి చైనా యుద్ధ విమానాలు, భారీ సంఖ్యలో సైనిక వాహనాలు చేరుకున్నట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. వాణిజ్య ఉపగ్రహ సంస్థ వాంటర్ ఈ చిత్రాలను తీజింది. నిర్మాణంలో ఉన్న రన్‌వేపై ఎనిమిది కే-8 తేలికపాటి దాడి విమానాలు, 20కిపైగా సహాయక వాహనాలు ఉన్నట్లు గుర్తించింది.
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ గత మంగళవారం లావోస్ రాజధాని వియంటియాన్‌కు సమీపంలోని బాన్ కీన్‌లో సంయుక్త శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన మరుసటి రోజే.. అంటే సెప్టెంబర్ 30న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో విమానాలు, వాహనాలతోపాటు భారీగా నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు కనిపించింది.
శిక్షణ కేంద్రం.. సైనిక స్థావరంగా మారుతుందా?
బాన్ కీన్‌లో నిర్మాణం శరవేగంగా సాగుతుండటాన్ని ప్రాంతీయ సైనిక అధికారులు, భద్రతా నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. ఇది కేవలం శిక్షణ కేంద్రానికే పరిమితం కాకుండా.. భవిష్యత్తులో చైనా ఆగ్నేయాసియాలో ఏర్పాటు చేసే తొలి పూర్తిస్థాయి విదేశీ సైనిక స్థావరంగా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో చైనా తన సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నప్పటికీ.. దేశ సరిహద్దుల వెలుపల దాని సైనిక స్థావరాల నెట్‌వర్క్ పరిమితంగానే ఉంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సైనిక మౌలిక వసతులతోపాటు కంబోడియాలోని రీమ్ నౌకాశ్రయంలో ప్రవేశ సదుపాయం, ఆఫ్రికాలోని జిబౌటీలో లాజిస్టిక్స్ స్థావరం వంటి కొన్ని కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.
వ్యూహాత్మకంగా కీలక లావోస్

ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ విశ్లేషకురాలు రాచెల్ వాండెన్‌బ్రింక్ ప్రకారం.. బాన్ కీన్‌ను ఎంచుకోవడం వెనుక చైనాకు నిర్దిష్టమైన సైనిక అవసరం కంటే అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉండొచ్చు. చైనాతో లావోస్‌కు సరిహద్దు ఉండటం, ఇరు దేశాల మధ్య రైల్వేతో సహా బలమైన మౌలిక వసతుల అనుసంధానం ఉండటం వల్ల బాన్ కీన్ వ్యూహాత్మకంగా ఉపయోగకరమైన ప్రాంతంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాన భూభాగ ఆగ్నేయాసియాలో చైనాకు ఇది సులభంగా అందుబాటులో ఉండే స్థావరంగా ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కే-8 విమానాలేనా?
ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న విమానాలు చైనా తయారు చేసిన హోంగ్డు జేఎల్-8 (కే-8) విమానాలుగా కనిపిస్తున్నాయని సింగపూర్‌కు చెందిన భద్రతా నిపుణులు కోలిన్ కోహ్, అలెగ్జాండర్ నీల్, వాంటర్ నిపుణులు తెలిపారు.కే-8 రెండు సీట్ల తేలికపాటి విమానం. ప్రధానంగా పైలట్ల శిక్షణకు ఉపయోగించినప్పటికీ.. తేలికపాటి దాడులు నిర్వహించే సామర్థ్యం కూడా దీనికి ఉంది. చైనా, పాకిస్థాన్ సంయుక్తంగా ఈ విమానాన్ని అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం లావోస్ వద్ద నాలుగు కే-8 విమానాలు ఉన్నట్లు లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అంచనా పేర్కొంది. లావోస్ వద్ద ఉన్న విమానాల నిర్వహణ పరిస్థితిపై సందేహాలు ఉన్నాయని సింగపూర్ ఎస్. రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన కోలిన్ కోహ్ వ్యాఖ్యానించారు.
రన్‌వే పొడిగింపుపై దృష్టి
ప్రస్తుతం బాన్ కీన్ రన్‌వే చిన్నదిగా, సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో దీనిని పొడిగించేలా నిర్మాణం చేపడుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చెబుతున్నారు. రన్ వేను పొడిగిస్తే పెద్ద విమానాలను కూడా అక్కడి నుంచి నడిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ నిఘా విమానాలు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది ఉపయోగపడొచ్చని విశ్లేషకుడు అలెగ్జాండర్ నీల్ తెలిపారు. నిర్మాణం పూర్తయ్యే కొద్దీ అక్కడ గగనతల రక్షణ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి నిల్వలు, ఇంధన నిల్వ కేంద్రాలు, నిఘా సదుపాయాలు ఏర్పాటవుతున్నాయా? అన్నదానిపై నిపుణులు దృష్టి సారించారు. ఇలాంటి సదుపాయాలు కనిపిస్తే.. ఇది కేవలం శిక్షణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రం కాదనే అనుమానాలకు మరింత బలం చేకూరుతుందని వారు చెబుతున్నారు.
గతంలో అమెరికా రహస్య స్థావరం
బాన్ కీన్‌కు మరో ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా రహస్య కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంది. 1970లలో లావోస్‌లో కమ్యూనిస్టు దళాలకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన యుద్ధ చర్యల సమయంలో బాన్ కీన్ ‘లిమా సైట్ 44’గా పిలువబడే వైమానిక స్థావరంగా ఉపయోగపడింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్యంగా నియంత్రించిన ఎయిర్ అమెరికా సంస్థ అక్కడ కార్యకలాపాలు నిర్వహించినట్లు చారిత్రక రికార్డులు ప్రకారం
అమెరికా మద్దతు పొందిన హ్మాంగ్ తెగకు చెందిన సైనికులను, ఆయుధాలు–సరఫరాలను లావోస్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో ఉన్న ‘లిమా సైట్స్’కు తరలించేందుకు ఎయిర్ అమెరికా విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించింది.1968 నుంచే బాన్ కీన్ నుంచి ఎయిర్ అమెరికా హెలికాప్టర్లు హ్మాంగ్ దళాలను ఇతర యుద్ధ ప్రాంతాలకు తరలించేవని లావోస్ చరిత్రపై పరిశోధనలు చేసిన జోఆఖిమ్ లీకర్ తెలిపారు. అమెరికా ఒకప్పుడు రహస్య సైనిక కార్యకలాపాలకు ఉపయోగించిన అదే ప్రాంతంలో ఇప్పుడు చైనా తన సైనిక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుండటం.. ఆగ్నేయాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది.
