మిర్చి దొంగలు అరెస్ట్..

మిర్చి దొంగలు అరెస్ట్..
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల గ్రామ శివార్లలో మిర్చి దొంగతనాలు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం పై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం రంగయ్యపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక టాటా ఏసీ వాహనం, ఒక టూ వీలర్ పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, గూడపల్లి, బాగిర్తిపేట, రావులపల్లి/రేగొండ గ్రామ శివార్లలో రాత్రి వేళల్లో మిర్చి పంట దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు.
వారి వద్ద నుండి దొంగతనానికి వాడిన ఒక టాటా ఏసీ వాహనం, ఒక టూ వీలర్, 04 మొబైల్ ఫోన్లు, మొత్తం రూ.51,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు : అజ్మీర రాజేష్, నునావత్ రాజు, భూక్య చరణ్, భూక్య కళ్యాణ్, నునావత్ తిరుపతి. దొంగతనానికి పాల్పడిన నిందితులందరూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండల పరిధికి చెందినవారే అన్నారు. రేగొండ పోలీస్ స్టేషన్ అధికారులు, రైతులు రాత్రి వేళల్లో పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినట్లయితే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
