మాల్ లిఫ్ట్‌లో చిన్నారులు.. గంటపాటు గిలగిల
- కరెంట్ లేక మధ్యలోనే ఆగిన లిఫ్ట్..
- యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం..
- రంగంలోకి పోలీసులు
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ లోని మేరీనాట్ చౌరస్తాలో వారం రోజుల క్రితం ప్రారంభమైన లక్కీ ఫ్యాషన్ షోరూంలో గురువారం తీవ్ర ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ చేసేందుకు వచ్చిన చిన్నారులు లిఫ్ట్‌లోకి వెళ్లగా.. విద్యుత్ అంతరాయం కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చిన్నారులు దాదాపు గంటపాటు లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయారు. లోపల కరెంట్ లేకపోవడంతో చిన్నారులు భయంతో గిలగిలలాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లిఫ్ట్ ఎంతసేపటికీ కదలకపోవడంతో బయట ఉన్న కస్టమర్లు అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో.. చివరకు లిఫ్ట్ పైకప్పును తొలగించి చిన్నారులను పైకి తీసుకువచ్చారు. దీంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో మాల్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ పిల్లలు దాదాపు గంటపాటు లిఫ్ట్‌లో చిక్కుకున్నా.. సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు లేవంటూ చిన్నారుల తల్లిదండ్రులు షోరూం యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. వికారాబాద్ సీఐ రఘు కుమార్ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? విద్యుత్ అంతరాయం సమయంలో లిఫ్ట్‌లో ఉన్నవారిని బయటకు తీసేందుకు ఎలాంటి అత్యవసర వ్యవస్థలు ఉన్నాయి? షోరూంలో లిఫ్ట్‌కు అవసరమైన భద్రతా ప్రమాణాలు, నిర్వహణ తనిఖీలు జరుగుతున్నాయా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటన నేపథ్యంలో వికారాబాద్‌లోని పలు షాపింగ్ మాల్స్‌లో భద్రతా ప్రమాణాల అమలుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం సమయంలో లిఫ్ట్‌లు పనిచేయకపోతే లోపల చిక్కుకున్న వారిని వెంటనే బయటకు తీసేలా అత్యవసర ఏర్పాట్లు ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా ప్రారంభమైన షోరూంలోనే ఇలాంటి ఘటన జరగడంతో వాణిజ్య సముదాయాల్లో లిఫ్ట్‌ల నిర్వహణ, భద్రతా తనిఖీలపై అధికారులు దృష్టి సారించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
వికారాబాద్ మేరీనాట్ చౌరస్తాలోని ఈ లక్కీ ఫ్యాషన్ షోరూం వారం రోజుల క్రితమే ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినట్లు సమాచారం. ప్రారంభమైన కొద్ది రోజులకే లిఫ్ట్‌లో చిన్నారులు చిక్కుకున్న ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై పోలీసుల విచారణలో లిఫ్ట్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఏమైనా లోపాలు బయటపడతాయా అన్నది చూడాల్సి ఉంది.
