Child-Abuse-Pocso-Cases-Telangana-Girls-Safety-Issues | కామాంధుల చేతిలో చిన్నారులు సమిధలు.. బంధాల ముసుగులో వికృత చేష్టలు

  • కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..
  • లక్షెట్టిపేటలో మరో బాలికపై దారుణం..
  • వరుస పోక్సో ఘటనలతో ఉలిక్కిపడుతున్న సమాజం

Child-Abuse-Pocso-Cases-Telangana-Girls-Safety-Issues | మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : పసితనం అంటే అమాయకత్వానికి ప్రతీక.. ప్రపంచం గురించి ఏమీ తెలియని వయసు. అలాంటి చిన్నారులపై కొందరు కామాంధులు సాగిస్తున్న దాష్టీకాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన చిన్నారులే కామ పిశాచుల బారిన పడుతున్న ఘటనలు తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఒకే రోజు వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు బాలికల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక చోట బంధువు ముసుగులో ఉన్న వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడగా.. మరో చోట ఆరోగ్యం నయం చేస్తానంటూ నమ్మించిన వ్యక్తి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.

బంధం పేరుతో బలి తీసుకున్న కామాంధుడు

కాగజ్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకున్న ఘటన యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదేళ్ల చిన్నారిపై సొంత మేనమామే లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అనుమానించి ఆరా తీయగా దారుణం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంధువే కదా అనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఓ చిన్నారి జీవితాన్ని ఛిద్రం చేసిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

వైద్యం పేరుతో వికృత చేష్టలు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో వెలుగులోకి వచ్చిన మరో ఘటన కూడా అంతే ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన మైనర్‌ కుమార్తెను ఓ మహిళ ధర్మపురికి చెందిన పెండెం సతీశ్‌ వద్దకు తీసుకెళ్లింది. ఆరోగ్యం నయం చేస్తానని నమ్మించిన అతడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి.. నమ్మకాన్ని వమ్ము చేసి చిన్నారిని వేధించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

ఒకే రోజు.. వరుస ఘటనలు

ఈ రెండు ఘటనలతో పాటు ఖమ్మం జిల్లా ముదిగొండలో మరో పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వినయ్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ పరిణామాలు బాలికల భద్రతపై తీవ్ర చర్చకు దారితీశాయి. చట్టాలు కఠినంగా ఉన్నా.. కొందరి మానసిక వికృతికి అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళన

చిన్నారులు చదువుల కోసం, అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో వారి భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి బయటే కాదు.. పరిచయస్తుల మధ్య కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారులతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే స్పందించేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పోలీసు శాఖ మరింత పటిష్టమైన నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

చిన్నారుల రక్షణ.. సమాజం బాధ్యత

బాలలపై నేరాలను అరికట్టడం కేవలం చట్టాల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో కుటుంబం, సమాజం, ప్రభుత్వ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. పసితనాన్ని కాపాడాల్సిన సమాజంలో.. అదే పసితనంపై దాడులు జరగడం అత్యంత విషాదకరం. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడాలంటే కఠిన శిక్షలతో పాటు సామాజిక మార్పు కూడా తప్పనిసరి.