suprem court| అర్హులైన వారికి న్యాయం అందిస్తాం

అర్హులైన వారికి న్యాయం అందిస్తాం

  • చట్ట ప్రకారం అందరి వాదనలు వింటాం
  • కలవలేనందుకు కారణాలు తెలిపా.. ఇండియా కూటమి లేఖపై సీజేఐ
  • లేఖలోని వివరాలు వెల్లడించలేను.. సీజేఐ స్పష్టీకరణ

ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ నేపథ్యంలో తనను కలిసేందుకు సమయం కోరుతూ వచ్చిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందించారు. తనకు వచ్చిన లేఖకు గత రాత్రే సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అయితే, వారిని కలవలేకపోవడానికి గల కారణాలను లేఖలో వివరించినట్లు పేర్కొన్నారు. లేఖలోని అంశాలను వెల్లడించేందుకు నిరాకరించిన ఆయన.. ఆ వివరాలను సంబంధిత నేతలనే అడిగి తెలుసుకోవాలని సూచించారు.

లేఖ రెండు రోజుల క్రితం తేదీతో ఉందని, తాను నిన్న అందుబాటులో లేకపోవడంతో ముందుగా దాన్ని స్వీకరించలేకపోయానని జస్టిస్‌ సూర్యకాంత్‌ వివరించారు. నిన్న రాత్రి స్పందిస్తూ, వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను తెలియజేసినట్లు చెప్పారు. ఆ లేఖలోని విషయాల గోప్యతను తాను కాపాడుతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రతి పౌరుడికీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు
సుప్రీంకోర్టు తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయని సీజేఐ స్పష్టం చేశారు. సాధారణ పౌరుడైనా, ఎన్నికైన ప్రజాప్రతినిధి అయినా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి పౌరుడికీ తమ సమస్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉందన్నారు. చట్ట ప్రకారం వారి అభ్యర్థనలను విచారించి, న్యాయపరంగా ఉపశమనం పొందేందుకు అర్హులైన వారికి తగిన న్యాయం అందిస్తామని వెల్లడించారు.