ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: డీఎంకే

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: డీఎంకే

  • ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి
  • ఎన్నికల అక్రమాలపై రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానం

చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డీఎంకే డిమాండ్‌ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈ మేరకు శనివారం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో, పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.

నాలుగు కీలక తీర్మానాలు
ఉదయం 11 గంటలకు మురసోలి మారన్‌ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై తీర్మానాలు చేశారు.

  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌.
  • విద్యార్థి సంఘాలు చేపట్టే నిరసనలకు మద్దతు.
  • కాంగ్రెస్‌, టీవీకే ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ తీర్మానం.
  • ఎన్నికల అక్రమాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయం.

ఎస్‌ఐఆర్‌ రద్దుకు డిమాండ్‌
ఎన్నికల ప్రక్రియలోని అవకతవకలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంకే కోరింది. ఇందులో భాగంగా ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా రద్దు చేయాలని, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఓటింగ్‌ నిర్వహణను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. ఈ అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం సమర్పించాలని సమావేశం నిర్ణయించింది.