చేవెళ్ల డిక్లరేషన్‌ హామీలను అమలు చేయాలి

లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు చేపడతాం..
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌. అశోక్‌

అచ్చంపేట, ఆంధ్రప్రభ : గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌. అశోక్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, తండాలకు రెవెన్యూ హోదా కల్పించాలని, తండాల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రతి గిరిజన తండా, గూడెం గ్రామపంచాయతీకి రూ.25 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించాలని, గిరిజన కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయడంతోపాటు లంబాడీ భాషను ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గిరిజనుల వలసలను అరికట్టి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎల్‌. దేశ్య నాయక్‌, రామావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌, వి. శ్రీనివాస్‌ నాయక్‌, ఎస్‌. లక్పతి నాయక్‌, శంకర్‌ నాయక్‌, దశరథం నాయక్‌, కేతావత్‌ గోపాల్‌ నాయక్‌, సురేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.