టీనేజర్లకు చాట్‌జీపీటీ.. ఇక‌ మరింత సేఫ్‌…

  • ఏఐతో అనుబంధంపై నియంత్రణలు..
  • తల్లిదండ్రులకు కొత్త భద్రతా ఫీచర్లు

ఆంధ్రప్రభ : కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. టీనేజర్ల కోసం ఓపెన్‌ఏఐ కీలక మార్పులు చేపట్టింది. స్వీయ-హాని, హింస, ఆహారపు అలవాట్లకు సంబంధించిన మానసిక ఆరోగ్య సమస్యలు, మరియు అసభ్యకరమైన లేదా గ్రాఫిక్ కంటెంట్ వంటి అంశాలపై ChatGPT ప్రతిస్పందనలు మరింత కఠినంగా నియంత్రించనున్నారు.

13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వినియోగదారుల కోసం ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో కూడిన ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్‌’ ని మంగళవారం ప్రకటించింది. యువత చాట్‌బాట్‌ను ఉపయోగించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఇకపై ఖాతా వివరాలు, వినియోగ విధానాల ఆధారంగా వినియోగదారు మైనర్‌గా గుర్తిస్తే.. టీనేజర్ల కోసం రూపొందించిన ప్రత్యేక భద్రతా నిబంధనలు ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయి. అంతేకాకుండా ఎక్కువసేపు చాట్‌జీపీటీ వినియోగించే టీనేజర్లకు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలని సూచించే రిమైండర్లు అందుతాయి. రాత్రి వేళల్లో వినియోగాన్ని తగ్గించేలా ‘క్వైట్‌ అవర్స్‌’ ఫీచ‌ర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

చదువుకు సహాయకుడిగా స్టడీ మోడ్‌

టీనేజర్ల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా స్టడీ మోడ్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇందులో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ఆలోచించేలా చేసే ప్రశ్నలు, సూచనల ద్వారా విషయాన్ని అర్థం చేసుకునే విధంగా చాట్‌జీపీటీ స్పందిస్తుంది. దీని ద్వారా ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా నేర్చుకునే అలవాటును పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చాట్‌బాట్‌లతో టీనేజర్లు భావోద్వేగంగా అతిగా అనుబంధం పెంచుకునే అవకాశాలపైనా ఓపెన్ ఏఐ దృష్టి పెట్టింది. చాట్‌జీపీటీకి వ్యక్తిగత భావాలు ఉన్నాయని, స్వీయచైతన్యం ఉందని భావించేలా స్పందించకుండా పరిమితులు విధించారు. అలాగే టీనేజర్ల ఖాతాల్లో కొన్ని ఫీచర్లను పరిమితం చేశారు. వాయిస్‌ మోడ్‌ వంటి సదుపాయాలను వారికి అందుబాటులో లేకుండా చేశారు.

తల్లిదండ్రులకు అలర్ట్‌ సదుపాయం..

తల్లిదండ్రులు తమ పిల్లల చాట్‌జీపీటీ ఖాతాలను తమ ఖాతాలతో అనుసంధానం చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ముఖ్యంగా స్వీయహాని లేదా ఆత్మహత్య వంటి అధిక ప్రమాదకర అంశాలపై చర్చ జరిగినప్పుడు తల్లిదండ్రులకు అప్రమత్తత సమాచారం అందే విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ అలర్ట్‌లను మానవ మోడరేటర్లు పరిశీలించిన తర్వాతే పంపించే విధానం ఉంటుందని ఓపెన్‌ఏఐ తెలిపింది. పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చాట్‌లలోని అవసరం లేని సమాచారాన్ని తొలగించే చర్యలు కూడా చేపట్టనుంది.

విమర్శల నేపథ్యంలో మార్పులు

చాట్‌జీపీటీ వినియోగంతో కొందరు యువతకు ఇబ్బందులు ఎదురయ్యాయన్న విమర్శలు, న్యాయపరమైన ఫిర్యాదుల నేపథ్యంలో ఓపెన్‌ఏఐ ఈ చర్యలు చేపట్టింది. ఏఐ చాట్‌బాట్‌లను డిజిటల్‌ స్నేహితులుగా ఉపయోగించే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో.. పిల్లలు, టీనేజర్ల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ముఖ్యంగా అమెరికాలో ఏఐ సంస్థలపై నియంత్రణ ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలు ఉపయోగించే ఏఐ సేవల్లో భద్రతా ప్రమాణాలపై పలు సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. సోషల్‌ మీడియా మాదిరిగానే ఏఐ చాట్‌బాట్‌ల వినియోగంపైనా నియంత్రణలు అవసరమనే వాదనలు పెరుగుతున్న వేళ.. ఓపెన్‌ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.