AP | శ్రీసిటీలో పేలుడు ఘటనపై.. చంద్రబాబు దిగ్భ్రాంతి..
AP | శ్రీసిటీలో పేలుడు ఘటనపై.. చంద్రబాబు దిగ్భ్రాంతి..
- మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు
AP | శ్రీ సిటీ, అక్టోబరు 3, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రైవేటు పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ పేలిన సమయంలో ఇద్దరు కార్మికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
కార్మికుల మృతి తీరని విషాదం: లోకేశ్
శ్రీసిటీలోని ప్రైవేటు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బాయిలర్ పేలుడులో కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: అనిత
శ్రీసిటీలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
