ChandrababuNaidu |మురసు తుఫాన్‌ తీరం దాటే వేళ.. సీఎం చంద్రబాబు అప్రమత్తం!

  • తెల్లవారుజామున 3.30 గంటలకు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌..
  • ప్రతి గంటకూ పరిస్థితిపై ఆరా
  • కొత్తపట్నం సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్‌..
  • ఉదయం 6.30 గంటలకు పూర్తిగా దాటుతుందని అధికారుల వెల్లడి
  • ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : మురసు తుఫాన్‌ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్‌ పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మరోసారి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తుఫాన్‌ తీరాన్ని తాకిందని, ఉదయం 6.30 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, రోడ్లపైకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత మేరకు నివారించాలని ఆదేశించారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రస్తుతం ఎక్కడా విద్యుత్‌ స్తంభాలు కూలిపోలేదని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని కలెక్టర్‌ తెలిపారు. రెండు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, వెంటనే వాటిని తొలగించినట్లు వివరించారు. రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.నెల్లూరు జిల్లాలో ఏడు చోట్ల చెట్లు కూలిపోగా, వెంటనే తొలగించినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వివరించారు.

ఒంగోలు జిల్లాలో ఐదు ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు సమాచారం అందగానే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారని కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు.కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్నాయని కలెక్టర్‌ తెలిపారు. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, ఎక్కడా విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిన ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్‌ వివరించారు.

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయని కలెక్టర్‌ లక్ష్మీషా తెలిపారు. బుడమేరు పరిధిలో పరిస్థితిని పరిశీలించామని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా కొన్ని కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించినట్లు చెప్పారు.

ఎన్నికల కౌంటింగ్‌పైనా దృష్టి

తుఫాన్‌ సహాయక చర్యలను కొనసాగిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. రెండు బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.

మురసు తుఫాన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి 10 గంటలకు తొలిసారిగా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి పరిస్థితిపై సమాచారం తెలుసుకుంటున్నారు. సోమవారం రోజంతా ఆర్టీజీఎస్‌లో ఉండి తుఫాన్‌ పరిస్థితిని సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేస్తూ మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.