అన్ని ప్రాంతాలకు నీరందించడమే చంద్రబాబు లక్ష్యం
రూ.35,314 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం.. రాయలసీమలో 14 ప్రాజెక్టులు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజమైన భగీరథ ప్రయత్నం చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కృష్ణా–గోదావరి జలాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బుధవారం కర్నూలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాల ప్రజల కలను చంద్రబాబు నాయుడు సాకారం చేశారని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడుదల చేయడం వల్ల తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ప్రాజెక్టులకు ‘క్యాలెండర్’
దేశంలోనే తొలిసారిగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, దాని ప్రకారం పనులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పట్టాభిరామ్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.35,314 కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిలో 14 ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతానికి చెందినవేనని వెల్లడించారు. వెనుకబడిన రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
జగన్ హయాంలో ప్రాజెక్టులకు తక్కువ నిధులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పట్టాభిరామ్ విమర్శలు చేశారు. చంద్రబాబు గతంలో ప్రాజెక్టుల కోసం రూ.12,484 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ఐదేళ్ల పాలనలో సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. జగన్ హయాంలో జీఓ నంబర్ 360 ద్వారా సుమారు 102 ప్రాజెక్టులను రద్దు చేశారని విమర్శించారు.
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో నిర్వహణ లోపాల కారణంగానే భారీ నష్టం జరిగిందని, దీనిపై అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను పట్టాభిరామ్ ప్రస్తావించారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు మరచిపోలేదన్నారు.
తుంగభద్రకు 33 కొత్త గేట్లు
తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోయిన ఘటన అనంతరం కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పట్టాభిరామ్ తెలిపారు. రాయలసీమకు అత్యంత కీలకమైన తుంగభద్ర జలాలను సమర్థంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
చంద్రబాబు నాయుడు జలయజ్ఞాన్ని నిజమైన జలయజ్ఞంగా అమలు చేస్తుంటే, గత పాలకులు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. కుప్పం, పులివెందులకు నీరు అందించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
విమర్శలు మానుకోవాలి
జగన్ ఇకనైనా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం మానుకోవాలని పట్టాభిరామ్ సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇదే విధంగా విమర్శలు కొనసాగిస్తే వైఎస్సార్‌సీపీకి రాష్ట్రంలో మరింత రాజకీయ నష్టం తప్పదని వ్యాఖ్యానించారు.
సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పి. నాగరాజ్ యాదవ్, రాష్ట్ర డైరెక్టర్లు పర్వీన్ తాజ్, డి. జేమ్స్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
