Chandrababu | వెలిగొండ నీటిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వెలిగొండ నీటి ప్రవాహాలతో కరవు ప్రాంతాల్లో జలకళ సంతరించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో మనుషులతో పాటు మూగజీవాలకు సైతం తాగునీటి అవసరాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికరమైన పోస్టు చేశారు. “జలంతోనే.. జీవం, జీవితం” అంటూ వెలిగొండ జలాల ప్రాధాన్యాన్ని వివరించారు.
వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో వానరాలు దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను సీఎం చంద్రబాబు పంచుకున్నారు. నీటి ప్రవాహం వద్దకు చేరుకున్న వానరాలు నీటిని తాగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. గతంలో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఇప్పుడు వెలిగొండ జలాలు అందుబాటులోకి రావడం సంతోషకరమైన పరిణామమని సీఎం పేర్కొన్నారు.
కరవు ప్రాంతాల్లో నీరు అందుబాటులోకి రావడం వల్ల పంటలకు మాత్రమే కాకుండా పశుపక్ష్యాదులు, వన్యప్రాణులకు కూడా ప్రయోజనం కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటితో ప్రాంతంలో మారుతున్న పరిస్థితులకు ఈ వీడియో ఒక ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. నీరు ఉంటేనే జీవం ఉంటుందని, నీటి లభ్యతతోనే జీవనం సాఫీగా సాగుతుందని సీఎం తన పోస్టులో అభిప్రాయపడ్డారు.
