Champions Trophy | నేడు బంగ్లాదేశ్ తో భార‌త్ ఢీ … మధ్యాహ్నం 2.30 మ్యాచ్ స్టార్ట్

దుబాయ్‌: ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా బంగ్లా దేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.. ఇక ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగి న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్‌ చేసిన రోహిత్‌ సేన సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో హాట్‌ ఫేవరెట్‌గా ఉన్న భారత్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 9వ ఎడిషన్‌ను అద్భుతంగా ఆరం భించాలని ఆతృతగా ఉంది. ఇప్పుడు మూడో ట్రోఫీయే లక్ష్యంగా భారీ అంచనాలతో ఛాంపియన్స్‌ పోరుకు సిద్ధమైంది. గ్రూప్‌-ఎలో తమ తొలి మ్యాచ్‌లో పసికూన బంగ్లాదేశ్‌తో అమీతుమీకి టీమిండియా సిద్ధమైంది. ఈ గ్రూప్‌లో ఇదే చిన్న జట్టు కావడంతో బంగ్లాపై భారీ విజ యం సాధించి మెగా టోర్నీని శుభారంభిం చేయాలని టీమిండియా చూస్తోంది. సంచలనాలకు మరో పేరైన బంగ్లాదేశ్‌ను తక్కువ అంచన వేయకూడదని క్రీడా విశ్లేషకులు టీమిండియాకు హెచ్చరిస్తున్నారు.

బుమ్రా గైర్హాజరీలో మరో సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ పేస్‌ దళాన్ని ముందుండి నడిపించను న్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత గాయంతో చాలా కాలం క్రికెట్‌కు దూరమైన షమీ పునరాగమనం చేశాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అసాధారణ ప్రదర్శ నలు చేసిన ఇతడు మళ్లి పాత ఫామ్‌ను అందుకుంటే ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనబడటం ఖాయం. ఇక అంత ర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవంలేని హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌లు ఒత్తిడిని జయించి షమీకి ఎంతవరకూ అండగా నిలుస్తారో చూడాలి. అయితే వీరికి పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య నుంచి మంచి సహకారం అందనుంది. ప్రస్తుతం పాండ్య ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.


ఇక టీమిండియా బౌలింగ్‌ భారమంతా స్పిన్నర్లపైనే ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌తో పాటు కుల్దిప్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు సాధించే అవకాశం ఉంది. భారత జట్టులోని సీనియర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా వరుసగా విఫలమవుతున్న వీరు ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనలు చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ సెంచరీతో ఫామ్‌ను అందుకోగా, కోహ్లీ హాఫ్‌ సెంచరీతో పర్వాలేదనిపిం చాడు.

ఐసీసీ టోర్నీలో ఘనమైన రికార్డులు కలిగిన విరాట్‌, రోహిత్‌ జోడీ ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ బ్యాట్‌ ఝుళిపించి మళ్లీ సత్తా చాటాలని భారత అభిమానులు కోరుకుం టున్నారు. ఇక కొద్ది కాలంగా వన్డేల్లో టీమిండియా నిలకడగా రాణిస్తోంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా చివరి మెట్టుపై బోల్తపడి తృటిలో ప్రపంచకప్‌ను కోల్పోయింది. ఇక ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా కేవలం 9 వన్డేలే ఆడింది. ఇందులో 5 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక టీమిండియా బ్యాటింగ్‌ కూర్పు విషయానికి వస్తే.. ప్రస్తుతం బారత్‌ బ్యాటింగ్‌ విభాగం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి ప్రమాదకరమైన టాప్‌ -5 బ్యాటర్లు టీమిండియాకు సొంతం. వీరిలో ఇద్దరు, ముగ్గురు క్రీజులో నిలబడినా భారీ స్కోర్లు నమోద వడం ఖాయం. ప్రస్తుతం గిల్‌, అయ్యర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వీరికి కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌ తోడైతే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనపడటం ఖాయం. అలాగే వీరి తర్వాత ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ కూడా భారీ పరుగులు సాధించగలరు. మొత్తంగా ప్రస్తుతం ప్రపంచ జట్లలో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా ప్రమాదక రమని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.

భారత్‌దే పూర్తి ఆధిపత్యం..
వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. భారత్‌, బంగ్లాలు ఇప్పటి వరకు వన్డేల లో 41 సార్లు తలపడగా.. అందులో టీమిండియా ఏకంగా 32 విజయాలు సాధించింది. ఇక బంగ్లా 8 సార్లే గెలిచింది. భారత్‌, బంగ్లాదేశ్‌లు చివరి సారి 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్లతో బంగ్లాను చిత్తు చేసింది. ఇక ఛాంపి యన్స్‌ ట్రోఫీలో ఇరుజట్లు ఒకేసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *