(ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : కాపీ తాగారా? టిఫినీ చేశారా? అక్కా, బావ ఏడి? అవ్వా, అన్నం తిన్నావా? అని ఆప్యాయంగా అడగగానే.. వీళ్లు బంధువులని భ్రమ పడతాం. వాళ్ల చిరునవ్వు పలకరింపుతో ఫిదా అవుతాం. కానీ ఈ పలకరింపులన్నీ దొంగల దోబూచులాటలని.. తెలిసిన క్షణాల్లో అవాక్కవుతాం. సరిగ్గా ఇదే జరిగింది. మంచి మాటలతో ఇరుగు పొరుగుకు వల పన్ని స్నేహం బురఖలో.. చోరీకి పాల్పడుతున్న యువ చోర జంట గుట్టును కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీసులు రట్టు చేశారు. మూడు చోరీ కేసుల్లో ఇద్దరు చోర నట శిఖామణులను అరెస్టు చేశారు.
వాళ్ళవద్ద నుంచి రూ.19.70 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, అవనిగడ్డ డీఎస్పీ టి.విద్యశ్రీ తెలిపిన వివరాల ప్రకారం, చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణరావునగర్ కు చెందిన నర్రా ప్రభావతి తన ఇంటికి తాళం వేసి.. అలవాటు ప్రకారం ఇంటి బయట గ్రైండర్లో తాళం చెవి పెట్టి గుడికి వెళ్ళింది. ఇంటికి వచ్చి తాళం తీసుకుని లోనికి వెళ్లింది. తన బీరువాలో 158 గ్రాముల బంగారు నగలు, ఒక కేజీ వెండి ఆభరణాలు కనిపించలేదు.
ఇంకేముందీ.. లబోదిబో మంటూ ఆగస్టు 26న చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బావురుమంది. ఆమె ఫిర్యాదు మేరకు చల్లపల్లి సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. అవనిగడ్డ డీఎస్పీ శ్రీవిద్య రంగంలోకి దిగారు. చల్లపల్లి సీఐ కె. ఈశ్వరరావు, ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం, మోపిదేవి ఎస్‌ఐ. వైవీవీ సత్యనారాయణ, చల్లపల్లి కానిస్టేబుల్స్ శివాజీ, ఈ. మనోహర్ తో ఒక బృందం, బందరు డీఎస్పీ క్రైమ్ పార్టీ సీసీఎస్ ఎస్ఐ పీవీ రత్తయ్య ఏఎస్ఐ జె. శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ కేవీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ జీ. కోటేశ్వరరావుతో మరో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు..
చోరీ జరిగింది ఇలా..
చల్లపల్లి నారాయణ నగర్ కు చెందిన షేక్ రహంతున్నీసా, నజీబుల్లా దంపతులు. అద్దె ఇళ్లల్లో కాపురం చేస్తారు. ఇరుగు పొరుగును మచ్చిక చేసుకుంటారు. అక్క-బావ, అన్నా-చెల్లి వరసలతో నమ్మకంగా ఉంటారు. ఇక పక్కింటి రోజువారి పనులపై నిఘా పెడతారు. ఇంటి తాళాలను ఎక్కడ పెడతారు, ఇంటిలోని నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఎక్కడ ఉంచుతారో పరిశీలిస్తారు. అదును చూసి చోరీ చేయటంలో నిష్ణాతులుగా ఈ జంట మారిపోయింది.
ఇదే రీతిలో నారాయణరావు నగర్ లో నర్రా ప్రభావతి గ్రైండర్ లో పెట్టిన తాళాలను రహంతున్నీసా తీసి ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి వెళ్లింది. ఇంటిలోని కప్ బోర్డ్ లోని బీరువా తాళాలను తీసి, బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించి ఎక్కడి తాళాలు అక్కడ పెట్టి వెళ్లిపోయింది. ఇక ఇతరులకు అనుమానం రాకుండా భర్త నజీబుల్లా పహారా కాశాడు.
చోరీ జంట.. సొత్తూ దొరికిందోచ్ …
తమకు అందిన కీలక సమాచారంతో ఓ జంటపై అనుమానం పెరిగింది. తరచుగా ఇళ్లను అద్దెకు మార్చుతున్న ఈ జంటపై అనుమానాలను నివృత్తి చేసుకోవటానికి చల్లపల్లి సీఐ, ఈశ్వరరావు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగారు. చల్లపల్లి శివారు పెదకళ్ళేపల్లి క్రాస్ రోడ్ హైవే రోడ్డు మార్జిన్లోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న నజీబుల్లా, రహంతున్నీసా దంపతులను అదుపులోనికి తీసుకున్నారు.
పోలీసులు తమ సహజ శైలిలో విచారించగా.. పోలీసులు అవాక్కయ్యారు. ఒకటి కాదు.. మూడు చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. పెనమలూరులో బంధువుల పెళ్ళికి వెళ్ళి బంగారు నగలు చోరీ చేశారు. 2024 మార్చి నెలలో పెడనలో ఒక చోరీ, 2025 మే నెలలో పెనమలూరులో మరో చోరీ, చల్లపల్లి ఇంకో చోరీ కేసుల్లో ఈ జంట నేరాలను అంగీకరించింది. ఈ మూడు చోరీ కేసుల్లో షుమారు 600 గ్రాముల బంగారం, సుమారు 92.800 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
చల్లపల్లి కేసులో 16.250 గ్రాముల బంగారపు చైన్, 15.760 గ్రాముల బంగారపు నక్లెస్, 27.120 గ్రాములు లాకెట్ నల్లపూసల గొలుసు. 7.330 గ్రాములు సాయిబాబా ఉంగరం,5.8.290 గ్రాములు బ్రాస్ లెట్, 3.890 గ్రాములు కళ్యాణ పంగరం, 3.980 గ్రాములు బంగారపు ఆరు రాళ్ల ఉంగరం, 2.508 గ్రాములు బంగారపు లక్ష్మీదేవి ఉంగరం. 2.914 గ్రాములు బంగారపు ఫాన్సీ ఉంగరం, 3.560 గ్రాముల బంగారపు మాటీలు జత, 8.280 గ్రాములు బంగారపు రాళ్ల జుంకాల (చెవి దిద్దులు) జత.2.020 గ్రాములు 12. బంగారపు జుంకాల జత (చెవి దిద్దులు). 4.940 గ్రాములు బంగారపు జుంకాల జత (చెవి దిద్దులు),51.420 గ్రాముల బిస్కెట్ సహా 158.262 గ్రాముల బంగారు నగలను, 92.800 గ్రాములు వెండి పట్టీలు ఒక జతను చల్లపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక పెడన పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో 203 గ్రాములు బంగారం, పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో, 243 గ్రాముల బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 20,000 ల నగదు, ఓ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అభినందించారు.











