చల్లపల్లిలో ఈనెల 15న జాబ్‌మేళా
380కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
చల్లపల్లి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 15న గురువారం ఉదయం 9 గంటలకు చల్లపల్లిలోని ఆర్ అండ్ డి ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల సమీపంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు.
ఈ జాబ్‌మేళాలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూఎన్‌వో మిండా లిమిటెడ్, పేటీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్ తెలిపారు. ఆయా కంపెనీల్లో 380కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు యువత ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి మంచి వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలతో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు రెజ్యూమె లేదా బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63006 18985, 99664 89796, 90005 71662 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
