‘చాయ్ వాలా’ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ సుధాకర్ మృతి

భీంగల్ టౌన్, అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): పోలీసుల వేధింపులు తాళలేక భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన హోటల్ నిర్వాహకుడు పొలాస సుధాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆత్మహత్యాయత్నానికి కారణాలు..

భీమ్‌గల్ పట్టణానికి చెందిన పొలాస సుధాకర్ స్థానికంగా చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచుతున్నాడనే నెపంతో పోలీసులు ఇటీవల అతనిపై వరుస కేసులు నమోదు చేశారు. సోమవారం విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు ఆదేశించారు. స్టేషన్‌కు వెళ్లిన సుధాకర్‌ను కోర్టుకు వెళ్లాలని సూచించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

దానితో ప్లాస్టిక్ బాటిల్‌లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పి, మొదట నిజామాబాద్ GGHకి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సుధాకర్ మంగళవారం ఉదయం కన్నుమూశాడు.

భిన్నమైన స్టేట్‌మెంట్లు – వివాదాస్పదం

స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడి మేరకే పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సుధాకర్ ఆరోపించాడు. అయితే ఆసుపత్రిలో సుధాకర్ ఇచ్చిన మరో స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఈ కేసులో పోలీసుల వేధింపులు కారణం కాదని పోలీస్ కమిషనర్ (CP) అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ ఘటనపై స్పందించిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధ్యుడైన భీమ్‌గల్ ఎస్ఐ తిరుపతిపై కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం పిలుపునిచ్చిన భీమ్‌గల్ బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. కాగా, మృతి చెందిన సుధాకర్ కుటుంబానికి పరామర్శ తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు ఆయన నివాసంలోనే ముందస్తుగా అరెస్ట్ చేశారు.