చక్కెర నిల్వలపై కేంద్రం కీలక నిర్ణయం
- వ్యాపారుల స్టాక్ పరిమితి కుదింపు..
- సెప్టెంబర్ 15 నుంచి అమలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చక్కెర నిల్వలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ధరలపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చక్కెర వ్యాపారులు, డీలర్లు నిల్వ చేసుకునే పరిమితిని కేంద్రం సగానికి తగ్గించింది. ఇప్పటివరకు 4,000 క్వింటాళ్లుగా ఉన్న గరిష్ఠ నిల్వ పరిమితిని 2,000 క్వింటాళ్లకు కుదించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో చక్కెరను నిల్వ చేసి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలను అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం.. చక్కెర డీలర్లు ఒకసారి సరుకు అందుకున్న తేదీ నుంచి 30 రోజులకు మించి ఆ నిల్వను ఉంచుకోవడానికి వీలుండదు. అంతేకాకుండా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా ఒక వ్యాపారి వద్ద 2,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ ఉండకూడదు. ఇంతకుముందు ఈ పరిమితి 4,000 క్వింటాళ్లుగా ఉండేది. వ్యాపారుల వద్ద చక్కెర నిల్వ పరిమితులను సగానికి తగ్గించడంతో.. భారీ మొత్తంలో నిల్వలను దాచిపెట్టి మార్కెట్‌లో కొరతను సృష్టించే అవకాశం తొలగిపోతుంది. దీంతో మార్కెట్‌లో చక్కెర సరఫరా సజావుగా సాగడంతో పాటు.. ధరలు అదుపులో ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోంది.
అయితే కోల్‌కతా, దాని పరిసర మహానగర ప్రాంతాలకు మాత్రం కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అక్కడ చక్కెర నిల్వ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గించకుండా.. గతంలో ఉన్న 4,000 క్వింటాళ్ల పరిమితినే కొనసాగించాలని నిర్ణయించింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చక్కెర సరఫరాలో కోల్‌కతా కీలక కేంద్రంగా ఉండటమే ఇందుకు కారణని కేంద్రం పేర్కొంది. కోల్‌కతాకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో చక్కెర సరఫరా అవుతుంది. అక్కడి నుంచి తూర్పు రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాలకు చక్కెర పంపిణీ అవుతుంది. ఈ సరఫరా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే కోల్‌కతాకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో చక్కెర వ్యాపారులు తమ నిల్వలను ఆ పరిమితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
